Tourists: ఖాళీ అవుతోన్న కాశ్మీరం ! ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్ ను వీడుతున్న పర్యాటకులు !

ఖాళీ అవుతోన్న కాశ్మీరం ! ఉగ్రదాడి ఘటనతో కాశ్మీర్ ను వీడుతున్న పర్యాటకులు !

Tourists : జమ్మూకశ్మీర్‌ లోని అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసింది. యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటన… కాశ్మీర్ లో ఉన్న పర్యాటకులను భయ కంపితులను చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి ఘటనతో వణికిపోయిన వారంతా వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. దీనితో దాదాపు కశ్మీర్‌ లోని అన్ని పర్యాటక ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. భయంతో పర్యాటకులు(Tourists) తమ టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటున్నారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు(Ram Mohan Naidu) వెల్లడించారు.

‘‘ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లాయి. 3,337 మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచాం’’ అని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Tourists – శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమానాలు

జమ్మూకశ్మీర్‌ లోని అనంతనాగ్‌ జిల్లాలో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌(Srinagar) నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్‌ వంటివి శ్రీనగర్‌ కు తాము షెడ్యూలు ప్రకారం నడిపే విమానాలకు తోడు మొత్తం ఏడు విమానాలను బుధవారం అదనంగా నడిపాయి. శ్రీనగర్‌(Srinagar) నుంచి విమానాలు నడుపుతున్న అన్ని ఎయిర్‌ లైన్లు ప్రయాణికులకు మద్దతుగా రద్దు, రీషెడ్యూలు ఛార్జీలను మాఫీ చేశాయి. పర్యాటకుల సౌకర్యార్థం బుధవారం రాత్రి 9.20కు శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా నుంచి ఢిల్లీకి అన్‌ రిజర్వుడుగా 18 కోచ్‌ లతో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్‌ పీఆర్వో హిమాంశు ఉపాధ్యాయ్‌ తెలిపారు.

90 శాతం కశ్మీర్‌ పర్యాటక బుకింగ్‌ లు రద్దు

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) అనంతరం కశ్మీర్‌లో పర్యటించేందుకు పర్యాటకులు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 90 శాతం జమ్మూకశ్మీర్‌ పర్యటన బుకింగ్‌లు రద్దయ్యాయని ఢిల్లీలోని పలు పర్యాటక రవాణా సంస్థలు బుధవారం వెల్లడించాయి. భద్రతాపరమైన కారణాలే దీనికి కారణమని పేర్కొన్నాయి. జమ్మూకు, వైష్ణోదేవి ఆలయం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా పర్యాటకులు భయపడుతున్నారని స్వస్తిక్‌ ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి కొత్త బుకింగ్స్‌ తీసుకోవద్దని శ్రీనగర్‌ ట్రావెల్‌ అసోసియేషన్‌ నుంచి సమాచారం వచ్చిందని ఏజే టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రతినిధి వెల్లడించారు.

కశ్మీరీ డ్రైవర్లు ఉదారత ! పర్యాటకులకు ఉచితంగా రవాణా కల్పిస్తున్న డ్రైవర్లు !

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి వ్యాపారులు తమ మంచి మనసు చాటుకుంటున్నారు. భయంతో వణికిపోతున్న పర్యాటకులకు ఉదారంగా సాయం అందిస్తున్నారు. ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగానే గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. మరికొందరు స్థానికులు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నారు. ‘‘ఇది కేవలం పర్యాటకుల మీదే కాదు… కశ్మీర్‌(Jammu Kashmir) ఆత్మపై జరిగిన దాడి. పర్యాటకులు మాకు అతిథులుగా వచ్చారు. ఇప్పుడు భయంతో వెళ్తున్నారు. ఇది చాలా బాధగా అనిపిస్తోంది. నవ దంపతులు భయంతో వణుకుతూ వచ్చి విమానాశ్రయానికి ఎలా వెళ్లాలని అడిగారు. వారిని సురక్షితంగా దిగబెట్టాను. వారు డబ్బులిచ్చేందుకు చాలా ప్రయత్నించారు. అలాంటి పరిస్థితుల్లో వారి నుంచి నేను డబ్బులు ఎలా తీసుకోగలను?’’ అని బిలాల్‌ అహ్మద్‌ అనే ఆటో డ్రైవర్‌ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. శ్రీనగర్‌ కు చెందిన ఒక డాక్టర్‌ తన ఇంటినే హోటల్‌ గా మార్చి పర్యాటకులకు ఉచితంగా వసతి కల్పించారు.

కశ్మీరీలుగా సిగ్గుపడుతున్నాం – దేశ ప్రజానీకానికి మెహబూబా ముఫ్తీ క్షమాపణ

పహల్గాంలో తీవ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు బలిగొనడంపై పీపుల్స్‌ డెమాక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ బుధవారం దేశ ప్రజానీకానికి క్షమాపణ కోరారు. ఈ దాడిపై కశ్మీరీలుగా సిగ్గుపడుతున్నారని, తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారి పట్ల కశ్మీరీలు సహానుభూతి కలిగివున్నారని ఆమె అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా పీడీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనగర్‌ లో నిర్వహించిన నిరసన ప్రదర్శనకు ఆమె నేతృత్వం వహించారు. ‘‘మా గుండెల్లో బాధ నిండింది. ప్రజల మనసులు విరిగిపోయాయి. తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారి వేదనను మేం పంచుకుంటున్నాం’’ అని మెహబూబా అన్నారు.

ఆరేళ్లలో తొలిసారి బంద్‌

ఉగ్రదాడిని నిరసిస్తూ జమ్మూకశ్మీర్‌లోని(Jammu Kashmir) చాలా ప్రాంతాల్లో బుధవారం బంద్‌ పాటించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత బంద్‌ జరగడం ఇదే తొలిసారి. ముఖ్యంగా జమ్మూ నగరం, ఉధంపూర్‌, కత్రా, కథువా, సాంబ తదితర ప్రాంతాల్లో పూర్తిగా బంద్‌ పాటించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ తరహా దాడులతో ఉగ్రమూకల స్థావరాలపై దాడిచేసి పాకిస్థాన్‌ కు బుద్ధిచెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే యుధ్‌ వీర్‌ సేథీ డిమాండ్‌ చేశారు. ఇటీవల హమాస్‌ చేసిన దాడికి ప్రతిగా ఇజ్రాయెల్‌ విరుచుకుపడిన స్థాయిలో… పాకిస్థాన్‌కు భారత్‌ సమాధానం ఇవ్వాలని జమ్మూకశ్మీర్‌ మాజీ డీజీపీ ఎస్‌పీ వైద్‌ పేర్కొన్నారు.

మరోవైపు బనిహాల్‌, రాజౌరీ, పూంఛ్‌, దోడా తదితర ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్‌ స్థానిక రాజకీయ పార్టీలు పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పలు ముస్లిం సంస్థలు కూడా ఉగ్రదాడిని నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించాయి. ఇదిలా ఉండగా, పహల్గామ్‌ ఉగ్రదాడిని నిరసిస్తూ జమ్మూకశ్మీర్‌ లోని పత్రికలు బుధవారం నాటి తమ సంచికల మొదటి పేజీలను నలుపు రంగుతో నింపేశాయి. ముష్కర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ నివాళి అర్పించాయి. కాగా, పర్యాటకులపై దాడికి పాల్పడినవారు మానవత్వం లేని జంతువులని, బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

Also Read : Pahalgam Terrorist Attack: ఇది సీమాంతర కుట్రే – సీసీఎస్ సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ

Leave A Reply

Your Email Id will not be published!