TRSLP : ఇప్పటికే కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరోసారి వరి కోసం కొట్లాడనున్నారు. ఫామ్ హౌస్ లో కీలక భేటీ అనంతరం ఇవాళ తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్పీ సమావేశం (TRSLP)జరుగుతోంది.
సీఎం కేసీఆర్ (TRSLP)అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ , రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు.
వీరితో పాటు పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుల పక్షాన పోరాడాలని, నిరసనలు చేపట్టాలని ఆదేశించినట్లు సమాచారం.
పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు సైతం పార్టీ స్టాండ్ కు అనుగుణంగా కేంద్రాన్ని నిలదీయాలని స్పష్టం చేశారు. కేంద్ర సర్కార్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకు రావాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్కార్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. రైతులకు అండగా కదలాలని సూచించారు కేసీఆర్.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి చోటా రైతుల వాణిని వినిపించాలని అన్నారు. సమావేశం అనంతరం మంత్రులతో కూడిన బృందం ఢిల్లీకి బయలు దేరనుంది. సీఎం పీఎంను కలవనున్నారు.
Also Read : రేవంత్ కు జగ్గారెడ్డి ఛాలెంజ్