TSNPDCL Jobs : విద్యుత్ శాఖలో కొలువుల భర్తీ
జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్
TSNPDCL Jobs : తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) లో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంస్థలో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని కోరింది ఎన్పీడీసీఎల్(TSNPDCL Jobs).
పైన తెలిపిన పోస్టుకు సంబంధించి ఏదైనా డిగ్రీ లో పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంతే కాకుండా ఎంఎస్ ఆఫీస్ , కంప్యూటర్ అప్లికేషన్ లో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేసింది. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్యన ఉండాలి.
ఆయా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 29 రాత్రి 11.59 గంటల లోపు మాత్రమే అవకాశం కల్పించింది. అప్లై చేసుకునేందుకు రూ. 320 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రూ. 29,255 నుంచి రూ. 54,380 వరకు వేతనం చెల్లించనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించి వరంగల్ , మహబూబాబాద్, జనగాం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్ , పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, కొంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే రాష్ట్రంలో పరీక్షల వ్యవహారం ప్రహసనంగా మారింది. ఎవరూ బ్రోకర్లను నమ్మ వద్దని సదరు సంస్థ కోరింది.
Also Read : అవినీతి దేశాభివృద్దికి అవరోధం – మోదీ