TTD: తిరుమల ఉచిత వివాహాలకు విశేష స్పందన ! 26వేలకుపైగా వివాహాలు !
తిరుమల ఉచిత వివాహాలకు విశేష స్పందన ! 26వేలకుపైగా వివాహాలు !
తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీటీడీ ఉచిత వివాహాలను కూడా నిర్వహిస్తోంది. 2016 ఏప్రిల్ 25 నుంచి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద టీటీడీ ఉచితంగా వివాహాలు నిర్వహిస్తూ వస్తోంది. కళ్యాణ వేదిక వద్ద ఒక్కటయ్యే కొత్త జంటల కోసం టీటీడీ పలు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉచిత వివాహాలకు… పురోహితుడు, మంగళవాయిద్యాలను కూడా టీటీడీ అధికారులు ఉచితంగా సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న ఉచిత వివాహాలకు విశేష స్పందన లభిస్తోంది. 2025 మే 1 వరకు టీటీడీ ఆధ్వర్యంలో 26,214 వివాహాలు జరిగాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఈ వివాహాలు నిర్వహించిన అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులతో కలిపి మొత్తంగా ఆరుగురికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) ద్వారా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ల వద్ద అందిస్తారు. అయితే, వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. వారు రాలేని పరిస్థితిలో ఉంటే అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
టీటీడీ ఉచిత వివాహాల కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునే విధానం
టీటీడీ ఉచిత వివాహాలు కోసం ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వధూవరులు, వారి తల్లిదండ్రులు మంచి ముహూర్తం చూసుకుని ఆన్‌లైన్ ద్వారా టీటీడీ కల్యాణవేదిక స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇందుకోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ సంప్రదించాల్సి ఉంటుంది. కళ్యాణ వేదిక కాలమ్ లో వివరాలను నమోదు చేసిన తర్వాత… ఆధార్ కార్డులను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక వయసు నిర్ధారణ కోసం జనన ధ్రువపత్రం, పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, మున్సిపల్ అధికారులు జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పెళ్లి తేదీ, సమయం నమోదు చేస్తే.. అక్‌నాలెడ్జ్‌మెంట్ జారీ చేస్తారు. ఈ అక్‌నాలెడ్జ్‌మెంట్ లెటర్ తీసుకుని వివాహానికి ఆరు గంటల ముందు తిరుమలలోని కళ్యాణ వేదిక కార్యాలయాన్ని సంప్రదించాలి.
టీటీడీ కళ్యాణ వేదికలో ఉచిత వివాహానికి అర్హతలు
టీటీడీ కళ్యాణ వేదికలో ఉచిత వివాహానికి వధూవరులు ఇద్దరూ హిందువులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు పూర్తై ఉండాలి. ప్రేమ వివాహాలు. రెండో వివాహాన్ని అనుమతించరు. వివాహానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. వారు రాలేని పక్షంలో సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తిరుమలలో వివాహం తర్వాత పెళ్లిని రిజిస్ట్రర్ చేసుకునేందుకు కల్యాణవేదిక వద్ద టీటీడీ ఏర్పాట్లు కూడా చేసింది. వివరాలు, సంబంధిత పత్రాలు సమర్పించి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చు.