TTD: శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం ఉచితం ! ఏం చేయాలంటే ?

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం ఉచితం ! ఏం చేయాలంటే ?

TTD : యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా రామకోటి తరహాలో గోవింద కోటిని రెండేళ్ల కిందట టీటీడీ ప్రవేశపెట్టింది. 25 సంవత్సరాలు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు గోవిందకోటి రాస్తే వారికి టీటీడీ ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తోంది. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. కోటిసార్లు నామాలు రాస్తే వారితోపాటు కుటుంబ సభ్యులందరూ వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకోవచ్చు. ఈ గోవింద కోటి రాయడానికి అవసరమైన పుస్తకాలు టీటీడీ(TTD) సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉన్నాయి. 200 పేజీలుండే పుస్తకంలో 39,600 నామాలు రాయొచ్చు. 10,01,116 నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరమవుతాయి. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టీటీడీ అంచనా వేసింది. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తిచేసి తిరుమలలోని టీటీడీ పేష్కార్‌ కార్యాలయంలో అందిస్తే వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని కల్పిస్తామని పేష్కార్‌ రామకృష్ణ తెలిపారు.

TTD – మొదటిగా కర్ణాటక విద్యార్థిని

మొదటిసారిగా ‘గోవిందకోటి’ నామాల పుస్తకాన్ని కర్ణాటకకు చెందిన కీర్తన గత ఏడాది ఏప్రిల్‌లో పూర్తి చేశారు. బెంగళూరులో ఇంటర్‌ పూర్తి చేసిన ఆమె 10,01,116 సార్లు గోవింద నామం రాసి టీటీడీకు సమర్పించారు. ఆ యువతికి టీటీడీ వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని కల్పించింది. అనంతరం మరో ఇద్దరు గోవిందకోటి నామాలను (10,01,116) రాసి వీఐపీ బ్రేక్‌ దర్శనం పొందారని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

ఎల్లుండి నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తాం – మంత్రి ఆనం

తిరుమలలో ఎల్లుండి అంటే గురువారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తెలుగురాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఎల్లుండి నుంచి బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని చెప్పారు. వేసవి రద్దీ దృష్ట్యా మే 1 నుంచి జులై 15 వరకు సిఫారసు లేఖల బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు గతంలో టీటీడీ(TTD) ప్రకటించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని వెల్లడించింది. ప్రోటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలు ఉంటాయని చెప్పింది. అయితే ఆ గడువును తగ్గించి మే 15 నుంచి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

యాంటీ డ్రోన్‌ తో ‘తిరుమల కొండ’కు భద్రత ?

హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతలంపై తరచూ డ్రోన్లు ఎగురుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తరువాత ఈ డ్రోన్లు అగ్ర దేశాలనూ కలవరపెడుతున్నాయి. డ్రోన్ చిన్న పరికరం అయినప్పటికీ… పెనువిధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల గగనతలంపై డ్రోన్లు ఎగరడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ తిరుమల గగనతనంపై డ్రోన్లను నిలువరించేందుకు యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ తీసుకువస్తున్నట్లు గత వైసీపీ ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసినప్పటికీ… అది కార్యరూపం దాల్చలేదు. టీటీడీ సీవీఎస్‌ఓగా పనిచేసిన అధికారి శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకాన్ని నిలువరించేందుకు బెంగళూరులోని భెల్‌ తయారు చేసిన అత్యాధునిక నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌(ఎన్‌ఏడీఎస్‌) కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తామన్నారు. రూ.కోట్ల విలువైన ఆ పరికరాన్ని అందించే దాత కోసం సంప్రదిస్తున్నట్లు తెలిపారు. అయితే కొంతకాలానికి ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు.

ప్రస్తుతం డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా పనిచేసిన డా. సతీష్‌రెడ్డి ఏపీకి శాస్త్రసాంకేతిక సలహాదారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సూచనలతో యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ తో తిరుమలలో రక్షణ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. టీటీడీ(TTD) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు సైతం యాంటీ డ్రోన్‌ టెక్నాలజీను త్వరలోనే తీసుకొస్తామన్నారు. తిరుమలపై విమానాలు, డ్రోన్లు ఎగరకుండా ‘నో ఫ్లై జోన్‌’గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుకు ఇటీవల లేఖ సైతం రాశారు. ఈ నేపథ్యంలో త్వరలో యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ తిరుమల సొంతం అవుతుందని భక్తులు ఆశిస్తున్నారు.

Also Read : Miss World: చార్మినార్, చౌముల్లా ప్యాలెస్ వద్ద సందడి చేసిన అందాల భామలు

Leave A Reply

Your Email Id will not be published!