Uddhav Thackeray : కరోనా పేరుతో రాహుల్ యాత్రకు అడ్డుకట్ట
శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే
Uddhav Thackeray : శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్, మాజీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాహుల్ గాంధీ చేపడుతున్న యాత్రకు మద్దతు తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్రలో కొనసాగిన యాత్రలో స్వయంగా పాల్గొన్నారు. ఈ తరుణంలో కరోనా పేరుతో యాత్రను అడ్డుకునేందుకు మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కరోనా రూల్స్ పాటించాలని కోరుతూ రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎంకు లేఖలు రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ రూల్స్ కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు ఉద్దవ్ ఠాక్రే. గుజరాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు భారీగా ర్యాలీలు చేపట్టారని, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ చేపట్టిన ప్రదర్శనలో పాల్గొన్నారని అప్పుడు ఈ కోవిడ్ రూల్స్ ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray).
ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. కోవిడ్ ప్రోటోకాల్ ను అనుసరించక పోతే యాత్రను నిలిపి వేయాలని కోరడాన్ని తప్పు పట్టారు శివసేన చీఫ్. ఇప్పటికే రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.
పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తోందన్నారు ఉద్దవ్ ఠాక్రే. ప్రభుత్వం దానిని అడ్డుకోలేక పోతోంది. కానీ కరోనా పేరు చెప్పి అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
కరోనా విజృంభించిన సమయంలో ఆనాటి యుఎస్ చీఫ్ ట్రంప్ ను ఆహ్వానించడం మరిచి పోయారా అంటూ ప్రశ్నించారు.
Also Read : కేంద్రం పెత్తనం జస్టిస్ లోకూర్ ఆగ్రహం