Vijaya Sai Reddy: వైఎస్ జగన్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది… గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో జగన్ తరువాత రెండో స్థానం కొనసాగిన విజయసాయిరెడ్డి… అనూహ్యంగా పార్టీను, రాజ్యసభ సభ్యత్వాన్ని వీడటంతో పాటు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమాల్లో విజయసాయి రెడ్డి పాత్ర ఉన్నట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేక కేసుల్లో అతని పేరును ప్రస్తావించింది. ముఖ్యంగా విశాఖ భూ కుంభకోణం, కాకినాడ సీపోర్టు అక్రమ బదిలీ, లిక్కర్ స్కాం ఇలా అనేక కేసుల్లో విజయసాయి రెడ్డి ప్రమేయం ఉందంటూ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో అతను రాజకీయాల్లోనుండి వైదొలగినప్పటికీ… కాకినాడ సీపోర్ట్ అక్రమ బదిలీ కేసులో విచారణ చేపట్టిన సీఐడీ పోలీసులు… బుధవారం విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచారు.
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై విజయసాయిరెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. వాటాలు ఏ విధంగా తీసుకున్నారు?, బలవంతంగా లాక్కున్నారా? అంటూ ప్రశ్నించారు. దీనితో సీఐడీ విచారణ అనంతరం… మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి… వైఎస్ జగన్ ను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్‌కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు… ‘‘కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుంది. జగన్ చుట్టూ కొందరు నేతలు కోటరీగా ఏర్పడ్డారు. జగన్‌ను కలవాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాలి. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు’’ అని వ్యాఖ్యలు చేశారు.
మూడున్నరేళ్లు అవమానాలు పాలయ్యా !
‘‘వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు నాకూ మా నాయకుడికి మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి, జగన్‌మోహన్ రెడ్డి మనసు విరిచే ప్రయత్నం చేసి, విజయం సాధించారు. మూడున్నర సంవత్సరాల పాటు అవమానాలు పాలయ్యా. నేను దిగిన ప్రతి మెట్టు ఇంకొకరు పైకి ఎక్కడానికి ఉపయోగపడింది. దీంట్లో చాలా మంది పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు. ఈ పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు నేను ఏవిధంగానూ నష్టపోవడం లేదు. చిత్తశుద్ధితో పనిచేశా. ఇప్పుడు కూడా జగన్‌మోహన్‌రెడ్డి బాగుండాలని కోరుకుంటున్నా. జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది. బయట నుంచి సమాచారం వెళ్లాలన్నా, ఆయనకు కొత్త వారిని పరిచయం చేయాలన్నా ఈ కోటరికీ ఏదో ఒక రకంగా లాభం ఉండాల్సిందే. అప్పుడే దేవుడి దగ్గరకు పంపుతారు. అక్కడ జరిగేది అదే. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదు. దీని వల్ల అతడితో పాటు పార్టీ, ప్రజలు అందరూ నష్టపోతారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ నుంచి ఎప్పుడు బయటపడతారో ఆ రోజు ఆయనకు భవిష్యత్ ఉంటుంది. ఇంతకన్నా ఏమీ చెప్పలేను’’
గతంలో సీబీఐ, ఈడీ కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ నన్ను ఏ2గా చేర్చారు. ఇప్పుడు కాకినాడ పోర్టు కేసులో కూడా ఏ2 ఉంచారు. అంతే తప్ప నేను చేసిందేమీ లేదు. ఏ2ను నాకు ఒక స్టాండడైజ్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ అయినప్పుడు వైసీపీలోనే ఉన్నాను. అప్పుడు నాకు పూర్తి వివరాలు తెలియవు. ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఎవరు చేశారు? ఎలా చేశారు? అన్న విషయాలు తెలిశాయి. నేను ఒక్కటే చెబుతున్నా, మా అల్లుడు శరత్ చంద్రారెడ్డి కంపెనీ విషయంలో నేను జోక్యం చేసుకోను. ఎవరికీ ఉద్యోగం కూడా ఇవ్వమని అడగను. నాకు కుటుంబ బంధాలే ముఖ్యం. జగన్ మోహన్‌రెడ్డి ప్రమేయ ఉందా? అని అడిగారు. నాకు తెలిసినంత వరకూ కేవీరావు, శరత్ చంద్రారెడ్డికి డీల్ చేసింది… కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డేనని చెప్పాను. అవసరమైతే పిలుస్తామని అన్నారు. ఈ కేసు ఇక్కడితో ఆగినా, ఆగకపోయినా నాకు వచ్చే నష్టం లేదు. నేను కేవీరావుతో మాట్లాడినట్లు నిరూపించండి. నేను ఎవరి దగ్గరా ప్రతిఫలం ఆశించలేదు’’