Village Volunteers: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం ! దినపత్రిక కొనుగోలుకు ఇచ్చే అలవెన్సు రద్దు !
పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం ! దినపత్రిక కొనుగోలుకు ఇచ్చే అలవెన్సు రద్దు !
Village Volunteers: గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలపై ఆంధ్రప్రదేశ్(AP) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెల పెన్షన్ల పంపిణీకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని నిర్ణయించింది. ఈ పెన్షన్లను గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా ఒకటవ తేదీన డోర్ డెలివరీ విధానంలో చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పార్ధ సారధి తెలిపారు. అంతేకాదు వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిపారు.
ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం గ్రామ,వార్డు వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకు దూరంగా ఉండాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలో సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేసారు. జూన్ నెలలో నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమచేసారు. దీనితో వాలంటీర్ల కొనసాగింపుపై పెను దుమారం రేగుతోంది. గత ప్రభుత్వంలోని అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళతో రాజీనామాలు చేసిన వాలంటీర్లు… ఇప్పుడు తమనే కొనసాగించాలంటూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనితో రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగించాలా లేదా కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి వాలంటీర్ల నియామకం చేపట్టాలా అనే దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు.
Village Volunteers – దినపత్రిక కొనుగోలుకు ఇచ్చే అలవెన్సు రద్దు !
రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలు కోసం గతంలో ఇచ్చే అలవెన్సును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. న్యూస్ పేపర్ అలవెన్సు కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం అడ్డదారుల్లో తమ సొంత పత్రిక సర్క్యులేషన్ పెంచుకొనేలా.. వాలంటీర్లు పత్రిక వేయించుకోవాలంటూ రూ. 200 చొప్పున చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సొంత పత్రికకు ప్రభుత్వ నిధులు దోచిపెట్టేందుకు జగన్ ఆ జీవోలు ఇచ్చారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం మెమో జారీ చేసింది.
Also Read : Janmabhoomi Express: ప్రయాణికులకు గుడ్‌న్యూస్ ! జన్మభూమి ఎక్స్‌ప్రెస్ పునరుద్ధరణ !