Vote from Home for Disabled: దివ్యాంగులకు ఇంటి వద్దకే ఓటు !
దివ్యాంగులకు ఇంటి వద్దకే ఓటు !
Vote from Home for Disabled: దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. దీనిలో భాగంగా దివ్యాంగులు ఇంటి వద్ద నుండి ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అయితే ఇంటి వద్ద నుండి ఓట్లు వేయాలనుకునే దివ్యాంగులు మాత్రం సంబంధిత బీఎల్వోల ద్వారా రిటర్నింగ్ అధికారికి ఫాం-12డీ సమర్పించాలని ఆయన సూచించారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటేసే దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’పై వెలగపూడి(Velagapudi) సచివాలయంలో రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు.
Vote from Home for Disabled Updates
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ… దివ్యాంగుల సౌలభ్యం కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరిందని పేర్కొన్నారు. ఎక్కువ మంది దివ్యాంగ ఓటర్లు ఉన్న కేంద్రాల్లో రెడ్‌క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి విభాగాల నుంచి వాలంటీర్లను నియమించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. అనంతరం దివ్యాంగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ… గత ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవటంలో వారికి ఎదురైన ఇబ్బందులు, వాటికి వారు సూచించే పరిష్కార మార్గాల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’పై జిల్లా, నియోజకవర్గస్థాయిలో నియమించే కమిటీల్లో దివ్యాంగ సంస్థల ప్రతినిధులకు చోటు కల్పిస్తామన్నారు. గర్భిణిలు, బాలింతలు, దివ్యాంగులైన ఉద్యోగులను ఎన్నికల విధుల నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే ఉద్యోగుల సమాచారమివ్వాలని అన్ని శాఖలను కోరామన్నారు.
Also Read : Ants in Mortuary: మృతదేహానికి చీమలు ! ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ?