Revanth Reddy : గ్యాంగ్ రేప్ కేసులో ఆ కార్లు ఎవరివి
పోలీసులకు రేవంత్ రెడ్డి ప్రశ్న
Revanth Reddy : హైదరాబాద్ జూబ్లి హిల్స్ లోని అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండి పడుతున్నాయి. అసలు దోషులు ఎవరో చెప్పకుండా, అఘయిత్యానికి ఉపయోగించిన వాహనాల యజమానులు ఎవరో తేల్చకుండా కేసు దర్యాప్తు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయాన్ని ప్రధానంగా లేవనెత్తారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించాలని అన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కొన్ని విషయాలు కావాలని దాచారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి. నిందితులు వాడిన బెంజ్ కారు ఎవరిదో చెప్పలేదు.
ఇన్నోవా కారులో అత్యాచారం జరిగిందని అంటున్నారు. మరి ఆ ఇన్నోవా కారు ఎవరి పేరు మీదుందో వెల్లడించ లేదు. గవర్నమెంట్ వెహికిల్ అని ఒకసారి చెప్పారు.
ఎవరికి కేటాయించారో ఇప్పటి దాకా తెలుసుకునే ప్రయత్నం చేయలేదా అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. పోనీ ప్రభుత్వ వాహనం అని ఉంటే ఆ స్టిక్కర్లు ఎవరు తొలగించారు.
ఇన్ని రోజులు ఆ ఇన్నోవా కారు ఎక్కడుందని నిలదీశారు. పోనీ ఆ వాహనాల ఓనర్లకు నోటీసులు ఇచ్చారా, వారు ఎవరో బయట పెట్టండి అని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు – కొత్వాల్