‘విరాట’ పర్వంలో రికార్డు: 5,716 పరుగులతో ఐపీఎల్ లో నెంబర్ 1 బ్యాట్స్ మేన్
టాప్ 3 స్థానాల్లో ఇండియన్స్.. వరుసగా సురేష్ రైనా 5,368, రోహిత్ శర్మ 5,114
కరోనా వచ్చింది..విరాట్ కి ప్రాక్టీస్ లేదు అంటూ విమర్శించిన సీనియర్ బ్యాట్స్ మేన్ సునీల్ గవాస్కర్ నోరు మూసుకునేలా విరాట్ తన రికార్డులను తనే తిరగ రాస్తున్నాడు. విరాట్ కొహ్లీకి ఛేజింగ్ లో అద్భుతమైన రికార్డు ఉంది..అతనికి ఛాలెంజ్ ఎదుర్కోవడమంటే ఇష్టం..ఒత్తిడిలో ఆడాలంటే మజా.. బాల్ బాల్ కి పరుగులు తీయాలి అన్నప్పుడు..ఆ వచ్చే కిక్ నుంచి..అతను ఆటను ఆస్వాదిస్తాడు. అందుకే ఎక్కువగా ఛేజింగ్ ని ఇష్టపడతాడు..ఈ క్రమంలోనే దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ లో ఆయన రెండు మ్యాచ్ ల్లో 90 వరకు వెళ్లి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మరోవైపు రోహిత్ శర్మ కూడా కొహ్లీకి దగ్గరగానే ఉన్నాడు. కానీ ఈ సిరీస్ లో అతన్ని అందుకోవడం మాత్రమే కష్టమే అని చెప్పాలి. దగ్గర దగ్గర ఇద్దరికి 500 పరుగులకు పైగా దూరం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ లో కొహ్లీ ఎవరికీ అందనంత దూరంలో 5716 పరుగులతో ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వన్డేలో నెంబర్ 1 ర్యాంకు కొహ్లీ పేరు మీదే ఉంది. రెండవ ర్యాంకు రోహిత్ శర్మ పేరున ఉంది. టెస్టుల్లో కూడా మొన్నటి వరకు నెంబర్ 1 ర్యాంకు కొహ్లీ పేరు మీదే ఉండేది..ఈమధ్యకాలంలో ఆస్ట్రేలియా జట్టులోకి తిరిగి వచ్చిన స్మిత్..ఆకలి మీద ఉన్న పులిలా పరుగులు తీసేస్తూ..అతి తక్కువ కాలంలోనే నెంబర్ 1 ర్యాంకు సాధించాడు.
ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగులో 2వ స్థానంలో కొహ్లీ కొనసాగుతున్నాడు.. స్మిత్ 911 పాయింట్లతో ముందుంటే కొహ్లీ 886 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ర్యాంకులు అటూ ఇటూ అవుతుంటాయి..అదేమంత విషయం కాదుగానీ..మనం జాగ్రత్తగా ఆడుతున్నామా లేదా? ఫలితంగా జట్టు విజయాలు సాధిస్తుందా? లేదా? అన్నదే ఆలోచించాలని విరాట్ చెబుతుంటాడు..
ఏది ఏమైనా భారత జట్టుకు దొరికిన ఒక ఆణిముత్యం కొహ్లీ అని చెప్పాలి. సచిన్ టెండుల్కర్ వెళ్లాక.. మళ్లీ అతనిలా రోజుకొక కొత్త రికార్డు తిరగరాయగలిగే వారు ఎవరున్నారని క్రీడాభిమానులు నిరాశ చెందుతున్న సమయంలో నేనున్నాను అంటూ వచ్చి..ఆ రికార్డులను తిరగమోత పెడుతూ..అభిమానులకు ఆనందాన్ని పంచుతున్న కొహ్లీ.. భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలంటే..తను వ్యక్తిగత రికార్డులతో ఉన్నతశిఖరంపై ఉండాలని అశేష భారత క్రికెట్ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.
