Yashwant Sinha : ఎన్నికలు కాదు ప్రజా ఉద్యమం – సిన్హా
రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ కాదు
Yashwant Sinha : విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యశ్వంత్ సిన్హా తన సతీమణితో కలిసి హైదరాబాద్ కు విచ్చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్, సీఎం కేసీఆర్ , మంత్రులు, ప్రజా ప్రతినిధులు , పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి జల విహార్ వరకు 10 వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా సిన్హా, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
నగరమంతా గులాబీమయం అయ్యింది. మరో వైపు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా నగరంలో ప్రారంభయ్యాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యశ్వంత్ సిన్హా ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశాన్ని విధ్వంసం నుండి కాపాడు కోవడమే మన ముందున్న పోరాటమని చెప్పారు.
ఇది కేవలం రాష్ట్రపతి పదవి కోసం జరుగుతున్న ఎన్నికలు కాదని ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు. భారత దేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని కాపాడు కోవడం, పరిరక్షించు కోవడమని పేర్కొన్నారు.
మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరు బాధ్యత గా మెలగాలన్నారు యశ్వంత్ సిన్హా. ప్రతి ఓటు విలువైనదనేనని అంతరాత్మ ప్రబోధంతో తమ కీలకమైన ఓటు తనకు వేయాలని కోరారు.
ఇదిలా ఉండగా రాష్ట్రపతి బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) కు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయన మొదట ఐఏఎస్ అధికారి. ఆ తర్వాత ఎన్నో పదవులు నిర్వహించారు.
బీజేపీలో చేరారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆయన టీఎంసీలో చేరారు. ప్రస్తుతం విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి పదవి బరిలో ఉన్నారు.
Also Read : జాతీయ సమావేశాల్లో ప్రధాని మోదీ