YS Jagan : వైసీపీకి జగన్ జీవిత కాలం బాస్
ప్రకటించిన విజయ సాయి రెడ్డి
YS Jagan : వైస్సార్సీపీ చీఫ్, ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) అరుదైన ఘనత సాధించారు. ఆయనను ఏకగ్రీవంగా పార్టీకి జీవితకాలం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరిగాయి. నాలుగు లక్షల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
ప్లీనరీ సమావేశాల్లో పార్టీ రాజ్యాంగానికి సవరణ చేశారు. ఇదిలా ఉండగా జగన్ రెడ్డి తరపున 22 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్లీనరీలో పాల్గొన్న వారంతా ఏకగ్రీవంగా సీఎం(YS Jagan) ను పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలని ప్రతిపాదించారు.
తీర్మానం కూడా చేశారు. పార్టీ పేరుకు సంబంధించి సవరణ చేసేందుకు ఆమోదించారు. అశేషమైన అభిమానుల కరతాల ధ్వనుల మధ్య సందింటి జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చీఫ్ పూర్తికాలం ఉండాలని నిర్ణయించారు.
ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయ సాయి రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి మొదటి రోజు 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
కానీ ఏ ఒక్కరు పోటీ చేయక పోవడం విశేషం. దీంతో జగన్ రెడ్డి ఎన్నిక లాంఛనంగా ముగిసింది. ఈ ప్లీనరీ సమావేశాల్లో 10 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.
మహిళా సాధికారత- దిశ చట్టం, విద్యా రంగం, నవరత్నాలు – డీబీటీ, వైద్యం, ఆరోగ్యంపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆపై ఆమోదించారు.
పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు – ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణలపై ఆమోదం తెలిపారు.
Also Read : ప్రజల ఆశీర్వాదం కొండంత బలం – జగన్