YS Jagan : ఏపీలో ఎన్డీఏ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం
సుబ్బరాయుడుని హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే ఎందుకు అరెస్టు చేయలేదని జగన్ ప్రశ్నించారు...
YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ‘‘ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతుంది. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారు. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికే అందరికి రైతు భరోసా అందేది’’ అని వైఎస్ జగన్ అన్నారు.
YS Jagan Comment
నంద్యాల జిల్లా సీతారామాపురంలో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అడుగుతారేమోనని సీఎం చంద్రబాబు భయానకం వాతావరణ కల్పిస్తున్నారంటూ జగన్(YS Jagan) తనదైన శైలిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికి టీడీపీ వాళ్లను పంపించి అనేక హామీలు ఇస్తామని చెప్పించారని, కానీ అధికారంలోకి రాగానే మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉండుంటే ప్రతి రైతుకు సొమ్ము అందేదని, అందరికీ సంక్షేమ పథకాలు అందేవని పేర్కొన్నారు.
గ్రామాల్లో ఆధిపత్యం కోసం దాడులు చేస్తూ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారని, సీతారామాపురంలో సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలింగ్ బూత్‌లో ఏజెంటుగా కూర్చున్నాడని, అతడిని దారుణంగా హత్య చేశారని ఆరోపణలు చేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. నారపురెడ్డి అనే వ్యక్తి ఎస్సైకి ఫోన్ చేసినా పోలీసులు సకాలంలో స్పందించ లేదని, కొంతసేపటికి ఎస్సై ఊరికి వచ్చినా పైఅధికారులకు ఫోన్లు చేస్తూ ప్రేక్షక పాత్ర పోషించారని నిందలు వేశారు. నారపురెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసినా పోలీసులు అదనపు బలగాలను పంపలేదని అన్నారు.
సుబ్బరాయుడుని హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే ఎందుకు అరెస్టు చేయలేదని జగన్(YS Jagan) ప్రశ్నించారు. నిందితుల కాల్ డేటా బయటకు తీస్తే అసలు వ్యక్తులు వెలుగులోకి వస్తారని, కేవలం మర్డర్ చేసిన వారిపైనే కాదు, హత్య చేయించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. సీతారామాపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబానికి అండగా ఉంటానని, నిందితులకు కఠిన శిక్ష పడేంత వరకు న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఇక సుబ్బరాయుడు కుటుంబానికి ప్రాణ రక్షణ కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు. ఇక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. మండలానికి ఇద్దరిని చంపాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్‌లో చెప్పారని, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని మాజీ సీఎం అన్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయ లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read : KTR : తన సోదరి జైలులో ఇబ్బంది పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన కేటిఆర్