YS Jagan : భారత దేశ రాజ్యాంగ నిర్మాతగా, దేశంలోనే మొట్ట మొదటి న్యాయ శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించిన మహోన్నత మానవుడు డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ అని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి.
ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగన్ రెడ్డి(YS Jagan ) మాట్లాడారు.
సూర్య చంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ జీవించి ఉంటారని, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని, అందరికీ అవకాశాలు దక్కాలని సూచించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు.
ఆయన కన్న కలల్ని తమ ప్రభుత్వం నిజం చేస్తోందని చెప్పారు. కొత్తగా పునర్ వ్యవస్థీకరించిన కేబినెట్ లో సైతం బహుజనులకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు.
అంటరానితనం, కుల వివక్ష, సమాన ప్రాతినిధ్యం ఉండాలని అంబేద్కర్ కోరుకున్నాడని , అందుకే భారత జాతికి అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని ప్రశంసించారు.
తాము ఏపీలో అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ అమలు చేస్తున్న పథకాలు అందేలా చూశామన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో విద్య, వైద్యం, ఉపాధి , మహిళా సాధికారత , పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.
సమాన ఫలాలు అందినప్పుడే అసలైన ప్రగతి సాధ్యమవుతుందన్నారు. చదవాలే కానీ భారత రాజ్యాంగం అద్భుతమైన గ్రంథమని పేర్కొన్నారు సీఎం జగన్ రెడ్డి.
నాడు నేడు కార్యక్రమం ఇవాళ ఏపీ దేశానికి ఓ రోల్ మోడల్ గా ఉందన్నారు సీఎం. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు చదువుకునేలా మెరుగైన వసతి సౌకర్యాలతో బడులు తీర్చిదిద్దామని తెలిపారు.
Also Read : ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ ఆందోళన