YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan) ఆందోళ వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరిగిపోవడంపై జగన్ (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కాగ్ నివేదికలను ఉటంకిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గి, అప్పులు పెరిగి పోతున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019–24 మధ్య మా ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదేపదే అబద్దాలు చెప్పాయి. రాష్ట్రంలో ఆదాయ వృద్ది తగ్గిందనీ, అభివృద్ది అనేదే లేదని తప్పుడు ప్రచారం చేశాయి.
YS Jagan Shocking Tweet
తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04% పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నిజంగానే ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే, మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది?, గతేడాదితో పోల్చితే ఈఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది.
‘2019–24 మధ్య వైయస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్షాలు తెలుగుదేశం (TSP), జనసేన (Janasena) పార్టీలు నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పని చేశాయి. ప్రభుత్వ విధానాల వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరోవైపు కీల రంగాల్లో మూలధన వ్యయం బాగా తగ్గడం వల్ల, ప్రభుత్వ ఆదాయం కూడా దారుణంగా తగ్గుతోందని, తద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని, అది ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తోందని నిందించాయి. ఇంకా తాము అధికారంలోకి వస్తే, రాష్ట్ర ఆదాయాన్ని చాలా వేగంగా పెంచడంతో పాటు, రుణాలు పెరగుకుండా చూస్తామని గత ఎన్నికల్లో ఆ పార్టీలు హామీ ఇచ్చాయి’.
‘కానీ ఇప్పుడు టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వ పనితీరును ఒకసారి పరిశీలిస్తే, కఠోర వాస్తవాలు కనబడతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయంలో (పన్నులు, పన్నేతర వసూళ్లు), అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే కేవలం 3.08% వృద్ధి మాత్రమే నమోదైంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 9.8% అభివృద్ధిని అంచనా వేస్తే, కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 12.04% పెరుగుదల నమోదైంది. మరి ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రం ఆర్థికంగా 12.02% అభివృద్ధి సాధిస్తుంటే, ప్రభుత్వ సొంత ఆదాయంలో అత్యల్పంగా 3.08% పెరుగుదల మాత్రమే ఎలా నమోదైంది?’.
‘గత ఏడాది రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో పరిస్థితి మారుతుందని అంతా భావించారు. కానీ, ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో అదే ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ప్రస్ఫుటమవుతోంది. గత ఏడాది ఇదే సమయంలో పోల్చి చూస్తే, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), అమ్మకం పన్నుల ఆదాయంలో ఇప్పటికే తగ్గుదల కనిపిస్తోంది’. ‘ఇదే సమయంలో 2023–24లో తొలి నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయంతో, ఇప్పుడు 2025–26లో మొదటి నాలుగు నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే అది కేవలం 2.39% మాత్రమే పెరిగింది (సీఎజీఆర్). వాస్తవానికి అది కనీసం 10% ఉండాల్సి ఉంది’.
‘ఇక్కడ మరో అత్యంత ఆందోళకరమైన అంశం విపరీతంగా పెరిగిన రాష్ట్ర అప్పులు. 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణాలు (పబ్లిక్ డెట్, పబ్లిక్ ఎక్కౌంట్, ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ల అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా చేసిన కార్పొరేషన్ల అప్పులు) రూ.3,32,671 కోట్లు. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం ఈ 14 నెలల్లో చేసిన మొత్తం అప్పులు ఏకంగా రూ.1,86,361 కోట్లు. అంటే గత ప్రభుత్వం మొత్తం 5 ఏళ్లలో చేసిన అప్పులో, 56 శాతం రుణాలను కూటమి ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే చేసింది. ఒకవైపు రాష్ట్ర ఆదాయంలో వృద్ధి చాలా తక్కువగా ఉండడం, మరోవైపు అప్పులు ఆకాశాన్ని అంటే విధంగా పెరగడం అత్యంత ఆందోళనకరమైన విషయం. అందుకే ఇప్పటికైనా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం, తమ విధానాలు పునరాలోచించాలి.
