YS Jagan Draupadi Murmu : ద్రౌపది ముర్ముకే జైకొట్టిన జగన్
ఆమె అభ్యర్థిత్వానికే వైసీపీ మద్దతు
YS Jagan Draupadi Murmu : భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ) ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆదివాసి బిడ్డ ద్రౌపది ముర్మును ప్రకటించింది.
దీంతో ఎంతో ఉత్కంఠ రేపిన అభ్యర్థి వ్యవహారం ఎట్టకేలకు ముగిసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి ఎన్నికల్లో మెజారిటీ లేదు.
తాము ప్రతిపాదించిన అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలవాలంటే ఇంకా 8 వేలకు పైగా ఓట్లు కావాల్సి ఉంటుంది. ముందుగా బీజేపీ అధినాయకత్వం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను దూతగా పంపించింది.
ప్రతిపక్ష పార్టీల చీఫ్ లతో మాట్లాడించింది. అధికార పక్షం, విఫక్షాలు కలిసి అందరికీ ఆమోద యోగ్యమైన అభ్యర్థిని రాష్ట్రపతి పదవికి ఎంపిక చేద్దామని ప్రతిపాదించింది. కానీ విపక్షాలు ఒప్పుకోలేదు.
చివరకు విపక్షాల తరపున టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి, అపారమైన రాజకీయ అనుభవం కలిగిన యశ్వంత్ సిన్హాను రంగంలోకి దించింది.
ఆయన గతంలో బీజేపీలో ఉన్నారు. ఇటీవల బెంగాల్ ఎన్నికల కంటే ముందు దీదీ సారథ్యంలో టీఎంసీలో చేరారు. తాజాగా వైఎస్సార్ సీపీ చీఫ్, ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Draupadi Murmu) నేతృత్వంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్న ద్రౌపది ముర్ముకు(YS Jagan Draupadi Murmu) మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు.
శుక్రవారం ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ తరపున విజయ సాయి రెడ్డి తో పాటు మిథున్ రెడ్డి హాజరు కానున్నారు.
Also Read : అపాచీ పరిశ్రమతో 10 వేల మందికి ఉపాధి