Zelensky : ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్ష యుద్దం కొనసాగిస్తూనే ఉంది. ఓ వైపు శాంతి చర్చల పేరుతో డ్రామా ఆడుతోందంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. సైనిక చర్య మాత్రమేనని ఇది పూర్తి స్థాయి యుద్దం కానే కాదంటూ బుకాయిస్తోంది రష్యా.
ఇప్పటికే బాంబుల మోతతో, మిస్సైళ్ల దాడులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఎక్కడ చూసినా కూలి పోయిన భవనాలు, శిథిలాల మధ్య మృత దేహాలు పడి ఉన్నాయి.
కానీ ఈరోజు వరకు అటు రష్యా చీఫ్ పుతిన్ ఇటు ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky) తగ్గడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికి పలుసార్లు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగాయి.
కానీ ఎలాంటి పురోగతి కనిపించ లేదు. యుద్దం ప్రారంభమై నేటితో 38 రోజులు పూర్తవుతాయి. రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ మాత్రం పుతిన్ ను నమ్మడం లేదు.
ప్రతి రోజూ సామాజిక మాధ్యమం వేదికగా జెలెన్ స్కీ (Zelensky)సందేశాలు ఇస్తూనే ఉన్నారు. అధికార దాహంతో ఉన్న పుతిన్ ను ఎలా నమ్మాలంటూ ప్రపంచాన్ని ప్రశ్నించాడు.
తాము ప్రతి సారి శాంతియుతంగా చర్చలు జరిపేందుకు సిద్దంగానే ఉన్నామని ప్రకటించినా పుతిన్ వినిపించు కోలేదంటూ మండిపడ్డాడు ఉక్రెయిన్ చీఫ్. అయితే చర్చల్లో భాగంగా రష్యా దళాలను వెనక్కి రప్పిస్తున్నట్లు చెబుతోంది.
అయితే రష్యా మాటల్ని నమ్మడానికి వీలు లేదని ఉక్రెయిన్ సైనికాధికారి చెబుతున్నారు. అదును చూసి దెబ్బ కొట్టడం పుతిన్ కు అలవాటేనంటూ ఆరోపించారు.
Also Read : శ్రీలంకలో అప్రకటిత ఎమర్జెన్సీ