CM Shinde: వందసార్లు శివాజీ పాదాలు తాకేందుకు సిద్ధమే : సీఎం శిందే
వందసార్లు శివాజీ పాదాలు తాకేందుకు సిద్ధమే : సీఎం శిందే
CM Shinde: వందసార్లు శివాజీ పాదాలు తాకేందుకు సిద్ధమేనని, అవసరమైతే క్షమాపణలు చెప్పడానికి వెనకాడనని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే(CM Shinde) మరోసారి స్పందించారు. వందసార్లు ఆయన పాదాలు తాకేందుకు సిద్ధమని, అవసరమైతే క్షమాపణలు చెబుతానన్నారు. రాజకీయాలే చేయాలనుకుంటే విపక్షాలకు అనేక అంశాలు ఉన్నాయని, శివాజీ మహారాజ్‌ను దీనికి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
CM Shinde Comment
ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం. వందసార్లు ఆయన పాదాలు తాకేందుకు సిద్ధంగా ఉన్నా. క్షమాపణలు చెప్పేందుకు వెనుకాడను. శివాజీ ఆశయాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం పనిచేస్తోంది అని ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. విగ్రహాన్ని పునర్నిర్మించడమే తమ ప్రయత్నమన్నారు. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ క్షమాపణలు చెప్పిన మరుసటి రోజే ముఖ్యమంత్రి ఇలా వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్‌లో 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని గతేడాది డిసెంబరులో ఏర్పాటు చేశారు. నేవీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఇటీవల ఆ విగ్రహం కూలిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తీవ్రస్థాయిలో మండిపడుతుతున్న విపక్షాలు.. విగ్రహ నిర్మాణంలోనే పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించాయి. విగ్రహ నిర్మాణాన్ని నౌకాదళం పర్యవేక్షించింది తప్ప.. తాము కాదని ప్రభుత్వం పేర్కొంది. విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను గుర్తించేందుకు, పునర్నిర్మాణానికి రెండు కమిటీలను ఏర్పాటు చేసింది.
Also Read : Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం : రామ్ చందర్