Godavari Danger : గోదారమ్మ ఆగ్రహం క్షణం క్షణం భయం
భద్రాచలం జన జీవనం అస్తవ్యస్తం
Godavari Danger : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ప్రధానంగా ఈసారి తెలంగాణపై వర్షాలు కక్ష కట్టాయి.
ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉండడంతో 10 జిల్లాలకు పైగా ప్రభావానికి గురయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న పరిణామాలపై సమీక్ష చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు , ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. పరిస్థితి చేయి దాటి పోకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.
ఇప్పటికే వార్తలను సేకరించే పనిలో నిమగ్నమైన ఎన్డీవీ న్యూస్ ఛానల్ కు చెందిన జర్నలిస్ట్ జుబేర్ వరద తాకిడికి కొట్టుకు పోయాడు. పరిస్థితి భయానకంగా ఉంది అంతకంతకూ గోదావరి నది(Godavari Danger) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రధానంగా ప్రమాద స్థాయిని దాటింది.
దీంతో భద్రాచలం జల దిగ్భంధంలో చిక్కుకు పోయింది. ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. అత్యవసరంగా ఆదుకునేందుకు హెలికాప్టర్ ను ఏర్పాటు చేశారు.
మరో వైపు అదనపు బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరింది ప్రభుత్వం. సింగరేణి సీఎండీ శ్రీధర్ వరద సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించారు. సీఎంకు సీఎస్ వివరాలు అందజేస్తున్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వరద కారణంగా విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్లు మునిగి పోయాయి. పలు ఏజెన్సీ ప్రాంతాలు చీకట్లోనే మగ్గి పోయాయి.
గోదావరి 80 అడుగులకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో జనంతో నిండి పోయాయి సురక్షిత ప్రాంతాలన్నీ.
Also Read : జల దిగ్బంధంలో భద్రాచలం