Prakash Raj : బీజేపీ జాతీయ వాదానికి అర్థం లేదు
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్
Prakash Raj : హర్ ఘర్ తిరంగాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్. విచిత్రం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ వాదం ప్రధాన ఆలోచన తనకు ఇంత వరకు అర్థం కాలేదన్నారు.
హర్ ఘర్ తిరంగా ప్రచారం కోసం పాలిస్టర్ జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఖాదీ కార్మికులకు కేంద్రంలోని అధికార బీజేపీ ద్రోహం చేసిందంటూ మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వ జాతీయ వాదానికి అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూర్ లో ఆయన మాట్లాడారు. బీజేపీకి జాతీయ వాదం, దేశం పట్ల వారి ప్రేమ గురించి నాకు అర్థం కాలేదన్నారు.
వారు భారత దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తే పెంచిన ధరలను తగ్గించడం, దేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం ముందుగా దృష్టి పెట్టాలన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా దేశంలోని ఖాదీ కార్మికులు జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేసిన పాలిస్టర్ జెండాలు వారి జీవనోపాధిని దెబ్బ కొట్టేలా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj).
విపరీతమైన పన్నులు విధిస్తూ దేశంలో చిన్న తరహా పరిశ్రమలను మనుగడ సాగించకుండా బీజేపీ వ్యవహరిస్తోందంటూ నిప్పులు చెరిగారు.
దేశం పట్ల, ప్రజల పట్ల బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదన్నారు. పన్నులు పెంచుకుంటూ పోతున్నారే తప్పా సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు ప్రకాశ్ రాజ్.
ప్రజాస్వామ్యంలో పన్ను చెల్లింపుదారుల కంటే ఏ వ్యక్తీ అతీతం కాదు. నాయకులను రాజులుగా భావించడం మానేయాలన్నారు.
Also Read : జాతీయ జెండాలు ఉచితంగా డెలివరీ