Amanatullah Khan : ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్
ఢిల్లీ వక్ఫ్ లో అక్రమ నియామకాలు
Amanatullah Khan : ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. 2020 సంవత్సరంలో అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఓఖ్లా నియోజకవర్గ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(Amanatullah Khan) ను అరెస్ట్ చేశారు.
ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాలు చేపట్టారంటూ ఆరోపణలు ఉన్నాయి. రెండేళ్ల కిందట కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) మొదటి రోజు ప్రశ్నించింది.
ఆపై దాడులు చేపట్టింది. అనంతరం అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా ఇదంతా కేంద్రం కావాలని ఆడుతున్న నాటకంలో భాగమని ఆప్ ఆరోపించింది.
ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మద్యం ఎక్సైజ్ పాలసీ స్కాంలో నిందితుడిగా చేర్చింది.
తాజాగా అమానతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా 48 ఏళ్ల ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచింది ఆప్ సర్కార్. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని, నియామకాలలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేసింది ఆప్.
కాగా అవినీతి నిరోధక శాఖ కీలక ప్రకటన చేసింది. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(Amanatullah Khan) ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా పని చేస్తున్న సమయంలో అన్ని నిబంధనలను , ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించారు.
అవినీతి, అనుకూలత ఆరోపణలతో 32 మందిని అక్రమంగా నియమించుకున్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అప్పటి సిఇఓ స్పష్టంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు.
అక్రమ నియామకాలకు వ్యతిరేకంగా మెమోరాండం కూడా జారీ చేశారని స్పష్టం చేసింది ఏసీబీ. అంతే కాకుండా ఢిల్లీ వక్ఫ్ బోర్డు నిధులను దుర్వినియోగం చేశాడంటూ ఆరోపించింది.
Also Read : గుజరాత్ పాకిస్తాన్ కాదు – ఫడ్నవీస్