RSS Chief Comment : కత్తుల కాలంలో ‘శాంతి’ కపోతం
పరస్పర సహకారం అత్యవసరం
RSS Chief Comment : భారత దేశం భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, జాతులతో కూడుకున్నది. ఇందులో ఏ ఒక్కటిని నిర్లక్ష్యం చేసినా లేదా పక్కదారి పడినా సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరాక కొన్ని వర్గాలలో మరింత భయాందోళనలు నెలకొన్నాయి.
దేశంలో ఇప్పుడు ప్రధానంగా మతం, ఉగ్రవాదం రెండూ ప్రధాన సమస్యలుగా మారాయి. ఒక వర్గం మరో వర్గంపై ఆరోపణలు, విమర్శలు, మాటల
తూటాలు పేల్చుతూ వస్తున్నాయి.
పార్టీలు ఎన్ని ఉన్నా దేశం వరకు వచ్చేసరికల్లా భారతీయ జెండా ఒక్కటేనని స్పష్టం చేస్తూ వచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కానీ ఇదే బీజేపీకి
చెందిన కొందరు నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొంత ఇబ్బందికరంగా మారేలా చేసింది.
ప్రధానంగా నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలు, పంధ్రాగస్టు రోజు గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షకు గురైన వారిని విడుదల చేయడం, ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి.
ఇదే క్రమంలో యూపీ లోని జ్ఞాన్ వాపి మసీదు కేసు, కర్ణాటకలో హిజాబ్ సంఘటన పెను సవాల్ గా మారాయి. త్వరలోనే దేశంలో 2024లో సార్వత్రిక
ఎన్నికలు జరగనున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతోంది. అది మోదీ పాలనను నిలదీస్తూ వస్తోంది.
ఇంకో వైపు కేవలం తమ వారిపై కాకుండా బీజేపీయేతర వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వాలను కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఇబ్బందులకు గురి చేయడం కూడా ప్రధాన సమస్యగా మారింది.
ఇవన్నీ పక్కన పెడితే బీజేపీకి మాతృ సంస్థగా పేరొందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇప్పటి నుంచే మెల మెల్లగా తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం మొదలు పెట్టింది.
ఈ దేశంలో బీజేపీ చీఫ్ కంటే ప్రధానమంత్రి కంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(RSS Chief) మాటకు ఎక్కువ విలువ ఉంటుందన్నది వాస్తవం.
అంటే ఒకరిని కించ పరిచినట్లు కాదు.
మొదటి నుంచీ సైద్ధాంతిక సంస్థగా ఎదుగుతూ వచ్చింది. ఈ దేశంలో కొన్ని వర్గాలలో నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు.
ఈ మేరకు ముస్లిం, ఇతర వర్గాల మత పెద్దలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముస్లింలు, ఇతర మైనార్టీ వర్గాల వారన్న అభిప్రాయం తొలగించు కోవాలని వారంతా భారతీయులేనని స్పష్టం చేశారు భగవత్. ముస్లిం వర్గాల నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ ను ప్రశంసలతో ముంచెత్తడం విశేషం.
మసీదులో శివ లింగం కోసం వెతకడం మానేయండి అంటూ సంచలన ప్రకటన కూడా చేశారు. ఆయన మాట లక్షలాది మందిపై ప్రభావం చూపుతుంది.
ఢిల్లీ మదర్సా విద్యార్థులతో జరిగిన సంభాషణ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక సూచన చేశారు.
అదేమిటంటే ఖురాన్ తో పాటు భగవద్గీతను కూడా చదవమని కోరారు. హిందువుల పట్ల ముస్లింలకు ఉన్న అనేక అపోహలను తొలగించాల్సిన బాధ్యత ముస్లిం పెద్దలపై ఉందని సూచించినట్లు సమాచారం.
అనుమానాలతో, అభద్రతా భావంతో ఉండి పోయిన సమాజంలో భగవత్ చేసిన ఈ ప్రయత్నం ఒకందుకు మంచిదేనని చెప్పక తప్పదు. ఏ మతమైనా
అంతిమంగా కోరేది అంతా ఒక్కరేనని..కలిసి ఉండాలని. అలా ఉండాలని ఆశిద్దాం.
Also Read : డైమండ్స్ ట్రేడింగ్ హబ్ గా సూరత్ – మోదీ