Munugode By Poll : హీట్ పెంచుతున్న మునుగోడు డెడ్ లైన్
మునుగోడులో ముగ్గురి మధ్యే పోటీ
Munugode By Poll : కోరి కొని తెచ్చుకున్న ఉప ఎన్నిక ఇది. మొన్నటి హుజారాబాద్ కంటే మరింత హీట్ పెంచుతోంది మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం బై పోల్. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.
ఇప్పటికే తీవ్ర ఆరోపణల మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ ను బదిలీ చేసింది. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఈసీ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డబ్బులు, మద్యం, హామీలు కురుస్తూనే ఉన్నాయి.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ ప్రచారం కొనసాగుతుండడం విశేషం. అనధికారిక అంచనా ప్రకారం ఇక్కడ వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.
ప్రధానంగా పలువురు బై పోల్(Munugode By Poll) బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్
పార్టీల మధ్యే కొనసాగుతోంది.
వేలాది వాహనాలు మునుగోడును చుట్టు ముడుతుండడం ఒక రకంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అవినీతికి ఓ పరాకాష్టగా భావించాల్సి ఉంటుందని
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న తెలంగాణకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పష్టం చేశారు.
ఆయన ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి మొత్తం పాలక వర్గం అంతా ఇక్కడే కొలువు తీరింది. ఎమ్మెల్యేలు,
మంత్రులు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు , ప్రజా ప్రతినిధులంతా మకాం వేశారు. ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ, విశారదన్ పార్టీ కూడా బరిలో ఉంది. కొంత
మేరకు బహుజనుల ఓట్లను చీల్చే చాన్స్ ఉంది. ఇక ప్రధాన అభ్యర్థుల పరంగా చూస్తే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,
పాల్వాయి స్రవంతి రెడ్డిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ, రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ మధ్యే ఆధిపత్య పోరు కొనసాగే అవకాశం ఉంది.
బీజేపీకి ఇది సవాల్ గా మారింది. ఈ మునుగోడు సీటు కాంగ్రెస్ పార్టీది. కానీ ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్ప మిగతా సీనియర్లు ఎవరూ లేక
పోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఇక కాషాయం, గులాబీ మధ్య హస్తం ఏ మేరకు ఓట్లను చీలుస్తుందనేది ప్రశ్నార్థకంగా తయారైంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కనీసం ఈ నియోజకవర్గం నుండి జరిగి ఉంటే కొంత అడ్వాంటేజ్ గా ఉండేది. మరో వైపు మంత్రి
జగదీశ్ రెడ్డి, కేటీఆర్ , హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, తలసాని లాంటి బడా నేతలు ఇక్కడే మకాం వేశారు. కులాలు, సంఘాల ప్రాతిపదికన ఓట్లను అంగట్లో సరుకులు లాగా కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బీజేపీ నుంచి సీనియర్లు ప్రచారంలో మునిగి పోయారు. సీఎం కేసీఆర్ కూడా బహిరంగ సభలు, ర్యాలీలో పాల్గొనే చాన్స్ ఉంది. మొత్తంగా మునుగోడు
బై పోల్ లో బహుజనులు ఎవరి వైపు నిలబడతారనేది వేచి చూడాలి. ఇదే సమయంలో యువత ఓట్లు కూడా కీలకం కానున్నాయి. పోలింగ్ తేదీకి దగ్గర పడుతుండడంతో ఎన్నికల హీట్ భారీగా పెరిగింది.
Also Read : వెంకట్ రెడ్డిపై సీతక్క సీరియస్