Sanjay Raut governor : గవర్నర్ కామెంట్స్ రౌత్ సీరియస్
వెంటనే గవర్నర్ ను తొలగించాలి
Sanjay Raut governor : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఛత్రపతి శివాజీ మహరాజ్ పై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయన పాత ఐకాన్ గా మారి పోయారని ప్రస్తుతం ట్రెండ్ అంబేద్కర్ , గడ్కరీలది కొనసాగుతోందంటూ నోరు పారేసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఈ తరుణంలో శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(Sanjay Raut) నిప్పులు చెరిగారు. గవర్నర్ తన బాధ్యతలను విస్మరించారని, పూర్తిగా పార్టీ కార్యకర్త కంటే అధ్వాన్నంగా మారారని ఆరోపించారు. శివాజీ మహరాజ్ ను అవమానిస్తూ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని వరుసగా నాలుగోసారి అని మండిపడ్డారు సంజయ్ రౌత్.
ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ , కోట్లాది మందికి స్పూర్తి దాయకంగా నిలుస్తూ వస్తున్న మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి ఇంత చులకనగా మాట్లాడడం దారుణమన్నారు. వెంటనే మరాఠా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు.
గవర్నర్ పూర్తిగా సోయి తప్పి మాట్లాడుతున్నాడని ఆ పదవికి ఉన్న గౌరవాన్ని మంట గలిపాడంటూ మండిపడ్డారు. ఒక్క ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు నోరు పారేసుకున్నాడంటూ ధ్వజమెత్తారు. వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు సంజయ్ రౌత్. ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేస్తున్నప్పుడు పేర్కొన్న ఆత్మ గౌరవం సీఎం ఏక్ నాథ్ షిండేకు ఉందా అని ప్రశ్నించారు.
Also Read : భయపడి బెయిల్ ఇవ్వడం లేదు – సీజేఐ