IT Raids Malla Reddy Comment : మల్లారెడ్డి మామూలోడు కాదప్పా
మంత్రి సరే మిగతా వారి మాటేంటి
IT Raids Malla Reddy Comment : గతంలో సినీ రంగంలో డాన్ లు కనిపించే వారు. కానీ సీన్ మారింది. ఎప్పుడైతే డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడో ఆనాటి నుంచి మాఫియా ఎలా ఉంటుందో చూపించాడు. బహుషా ఆర్జీవీ తీసినంతగా ఇంకే డైరెక్టర్ దరి దాపుల్లోకి రాలేదంటే అతిశ యోక్తి కాదేమో.
ఆ తర్వాత అంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. ఇదేమిటి మల్లారెడ్డిని ప్రస్తావించకుండానే ఆర్జీవీ ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా. దానికి ఈ మంత్రి చామకూరకు లింకు ఉంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్ట పోయిందంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచాయి. రాష్ట్రం వచ్చాక భవిష్యత్తు బాగుంటుందని భావించారు. కానీ అంతా రివర్స్ గా మారింది. కళ్లు చెదిరే కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణలో దొరుకుతున్నాయి.
ఇది తెలంగాణ ప్రజలను విస్తు పోయేలా చేస్తోంది. మొన్నటికి మొన్న హుజూరాబాద్ ఎన్నిక, నిన్నటికి నిన్న మునుగోడు ఎన్నికలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ , కాంగ్రెస్ లు డబ్బులు వెదజల్లడంలో పోటీ పడ్డాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక సందర్భంగా లెక్కకు రాని కోట్లను పట్టుకుంది.
ఇది పక్కన పెడితే ఓ వైపు ఉద్యోగాలు రాక, నెల నెలా జీతాలు అందక నానా తంటాలు పడుతుంటే వీళ్లందరికి కోట్లు ఎలా లభిస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఓ వైపు ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి లింకు మొదట హైదరాబాద్ తో ఉండడం అనుమానాలకు దారి తీస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ పక్కన పెడితే ఇటీవల చోటు చేసుకున్న ఢిల్లీ స్కాం కేసులో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.
అటు ఆప్ ఇటు టీఆర్ఎస్ అగ్ర నాయకులతో అంటకాగిన అనుచరులు పట్టు బడ్డారు. ఇదే సమయంలో తాజాగా మరో కోలుకోలేని షాక్ తగిలింది. కేసీఆర్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న చామకూర మల్లారెడ్డి హాట్ టాపిక్ గా మారారు.
ఏకంగా ఐటీ శాఖ 50 బృందాలతో దాడులు(IT Raids Malla Reddy) జరపడం కలకలం రేపింది. ఆయన బంధువుల ఇళ్లల్లో ఏకంగా రూ. 4 కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయనేది తేలాల్సి ఉంది.
తాజాగా 50 చోట్ల జల్లెడ పట్టారు. మరో వైపు క్యాసినో కేసు కూడా ఇందులో లింకు ఉన్నట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం లేకుండానే రంగంలోకి దిగింది ఐటీ శాఖ. చీకోటి ప్రవీణ్ కేసులో కీలకంగా ఉన్నారు.
ప్రస్తుతం మల్లారెడ్డితో పాటు ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడు, వియ్యంకుడు, బంధువులు, సన్నిహితులకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో ఐటీ
సోదాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 50 టీంలు పాల్గొనడం విశేషం. ఈ సోదాలు పన్ను ఎగవేతపై చేపట్టారు. ఈ దాడుల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా మల్లారెడ్డి మామూలోడు కాదని తేలింది. ఆయనకు ఒక విశ్వ విద్యాలయం, 38 ఇంజనీరింగ్ కాలజీలు, రెండు మెడికల్ కాలేజీలు, స్కూళ్లు,
పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్ , వందలాది ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు.ఇదే సమయంలో మల్లారెడ్డి విద్యా సంస్థల లావాదేవీలు క్రాంతి బ్యాంకు ద్వారా జరిగాయి.
ఇదిలా ఉండగా మల్లారెడ్డిపై ఐటీ దాడుల పరంపర కొనసాగుతుండడంతో ప్రగతి భవన్ లో కీలక సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత ఎవరిని కేంద్ర దర్యాప్తు సంస్థలు పలకరిస్తాయో వేచి చూడాలి.
Also Read : మంత్రికి షాక్ బంధువు ఇంట్లో నగదు సీజ్