Farmers Issue Comment : రైత‌న్న‌ల‌పై వివ‌క్ష ఎందుకీ క‌క్ష‌

త‌రాలు మారినా త‌ల రాత మార‌ని వైనం

Farmers Issue Comment : జై జ‌వాన్ జై కిసాన్ ఇది ఈ దేశాన్ని ఇంకా స‌జీవంగా ఉండేలా చేస్తోంది. రైతే రాజు ఒక‌ప్పుడు. కానీ ఇప్పుడు అంద‌రికీ కొర‌గాకుండా పోయాడు. కోట్లాది ప్ర‌జ‌ల‌కు నిత్యం ఆహారాన్ని అందించే అన్న‌దాత‌ల‌కు ఇవాళ గుర్తింపు లేకుడా పోయింది. పంట పండించిన ద‌గ్గ‌ర నుండి అమ్ముకునేంత దాకా యుద్దం చేయాల్సి వ‌స్తోంది.

ఇప్ప‌టికే సాగు భార‌మై, బ‌తికేందుకు ధైర్యం స‌రి పోక వంద‌లాది మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు(Farmers Issue) పాల్ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చ‌ని పోయిన వారికి క‌నీసం న‌ష్ట ప‌రిహారం ఇవ్వ‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దోబూచు లాడుతున్నాయి. నెల నెలా త‌మ వేత‌నాలు భారీ ఎత్తున ఠంఛ‌నుగా తీసుకుంటున్న పాల‌కులు రైతుల వ‌ర‌కు వ‌చ్చేస‌రికి మీన వేషాలు లెక్కిస్తున్నారు.

స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్స్ పేరుతో, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు పేరుతో విలువైన భూముల‌పై క‌న్నేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, చ‌ట్టంలోని లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని పాల‌కులు రాబంధుల్లా త‌యార‌య్యారు. బ‌తికి ఉండ‌గానే రైతుల‌ను చంపేస్తున్నారు. మాన‌సికంగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో, తాయిలాల ఆశ‌లు చూపించి రైతుల బ‌తుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నారు. కొలువు తీరిన ప్ర‌భుత్వాలు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తున్నారు. బ‌డా బాబుల‌కు, దొంగ‌ల‌కు, అక్ర‌మార్కుల‌కు, ఆర్థిక నేర‌గాళ్ల‌కు, కార్పొరేట్ ల‌కు రెడ్ కార్పెట్ లు ప‌రుస్తున్నారు.

కానీ ఆరుగాలం శ్ర‌మించి గింజ‌లు పండించే రైతుల ప్ర‌యోజ‌నాల గురించి, వారి బాగు గురించి శ్ర‌ద్ద చూప‌డం లేదు. రాను రాను వ్య‌వ‌సాయం పండుగ కాదు దండుగ అనే స్థాయికి తీసుకు వ‌చ్చారు.

కోట్లాది రూపాయ‌లు స‌బ్సిడీల పేరు మీద క‌ట్ట‌బెడుతూ కంపెనీల‌కు లాభాలు చేకూర్చేలా చేస్తున్నారు. ఇది గ‌త కొంత కాలంగా కొన‌సాగుతూ వ‌స్తున్న‌దే. సాగుకు సాయం చేస్తున్నా అది కొంత మాత్రమే చంద్రునికో నూలు పోగు అన్న‌ట్టుగా ఉంది. 140 కోట్ల భార‌త దేశం అత్య‌ధికంగా 60 శాతానికి పైగా వ్య‌వ‌సాయ రంగంపైనే ఆధార‌ప‌డి ఉంది.

రైతుల ప‌ట్ల రోజు రోజుకు మ‌రింత ఒత్తిడి(Farmers Issue) పెరుగుతోంది. టెక్నాల‌జీ భూతం క‌మ్మేసినా క‌రోనా క‌ష్ట కాలంలో కోట్లాది మందికి ప‌ని క‌ల్పించింది, ఆకలితో ఉన్న అన్నార్థుల‌కు ఆకలిని తీర్చేలా చేసింది వ్య‌వ‌సాయ రంగ‌మే..రైత‌న్న‌లే. ఏ రోజైతే వ్య‌వ‌సాయ రంగాన్ని, రైతుల‌ను, శ్ర‌మ జీవుల‌ను ప‌క్క‌న పెడ‌తామో ఆరోజే దేశం స‌ర్వ నాశ‌నం అవుతుంద‌న్న‌ది గ‌మ‌నించాలి. ఇక‌నైనా పాల‌కులు గుర్తించ‌క పోతే రైత‌న్న‌ల ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌ద‌ని తెలుసుకోవాలి. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Also Read : అగ్నిప‌థ్ మోసం జీఎస్టీ భారం – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!