Pazha Nedumaran : నెడుమారన్ వైపు దేశం చూపు
ఎవరీ పజా ఏమిటా కథ
Pazha Nedumaran : ఎవరీ పజా నెడుమారన్ అంటూ యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశారు. ఆయన చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. 2009లో తమిళులకు ఒక దేశం కావాలని అలుపెరుగని పోరాటం చేసిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ ప్రకటన చేశాడు. సోమవారం నెడుమారన్ చేసిన ప్రకటన కల్లోలానికి దారి తీసింది. పజా నెడుమారన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు, రచయిత, సామాజిక కార్యకర్త. ఆయనకు 89 ఏళ్లు.
ఉలక తమిళర్ పెరమైప్పు ( ప్రపంచ తమిళ కాన్ఫెడరేషన్ ) వ్యవస్థాపకుడు. తమిళ జాతీయ ఉద్యమ నాయకుడు. అంతే కాదు తమిళ ఈలం లిబరేషన్ సపోర్టర్స్ కో ఆర్డినేషన్ కమిటీ చీఫ్ గా కూడా ఉన్నారు పజా నెడుమారన్(Pazha Nedumaran).
మాజీ జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. స్వతహాగా చేయి తిరిగిన రచయిత. తమిళ జాతీయ వాదిగా గుర్తింపు పొందారు. తమిళంలో, ఆంగ్లంలో అనేక పుస్తకాలను రాశారు. తమిళనాడులో పేరొందిన రాజకీయ నాయకుడు కె. కామరాజ్ కు సన్నిహితుడు. ఇందిరాగాంధీని రెండుసార్లు కలిశాడు. కామరాజ్ మరణాంతరం ఆ పార్టీకి దూరంగా ఉన్నాడు నెడుమారన్.
తమిళ పత్రిక థెన్ సెయిదికి ప్రధాన సంపాదకుడిగా ఉన్నారు. నెడుమారన్ కుమారుడు పళని కుమనన్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. 2015లో పులిట్జర్ బహుమతి అందుకున్నారు. 1979లో ఇందిరాగాంధీ తమిళనాడులో సందర్శించిన సమయంలో ఆమెపై దాడి జరిగింది.
ఇందిరను రక్షించాడు నెడుమారన్. కేంద్ర పదవిని ఇస్తానన్నా సున్నితంగా తిరస్కరించాడు నెడుమారన్. తన పెద్ద కొడుకు అని పిలిచింది ఇందిరా గాంధీ. కన్నడ సినీ నటుడు రాజ్ కుమార్ ను వీరప్పన్ అపహరించినప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంల అభ్యర్థన మేరకు నెడుమారన్ నేతృత్వంలో దూతల బృందం అడవుల్లోకి వెళ్లింది.
ఆయనను రక్షించింది. 2007లో జాఫ్నాలో ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం నినదించాడు. వారి కోసం నిరాహారదీక్ష చేపట్టాడు నెడుమారన్. 1985లో నెడుమారన్(Pazha Nedumaran) శ్రీలంకలోని తమిళ ప్రాంతాలలో రహస్య పర్యటన చేశాడు. అక్కడ శ్రీలంక సైన్యం చేసిన దురాగతాలను వీడియో తీశాడు.
నెడుమారన్ ఈ ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఇప్పుడు ప్రభాకరన్ బతికే ఉన్నాడన్న ప్రకటన ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా మారి పోయింది.
Also Read : తమిళ పులి బతికే ఉంది