Roopa Sindhuri Comment : ‘సీనియ‌ర్ల’ సిగ‌ప‌ట్లు జ‌నం చీవాట్లు

ఐపీఎస్ రూపా వ‌ర్సెస్ ఐఏఎస్ సింధూరి

Roopa Sindhuri Comment : ఔను వాళ్లిద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. ఒక‌ప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే గౌర‌వం ఉండేది. కానీ రాను రాను ప్ర‌యారిటీ త‌గ్గిపోతోంది. ఎప్పుడైతే పాలిటిక్స్ జోక్యం చేసుకోవ‌డం మొదలు పెట్టాయో ఆనాటి నుంచి వివాదాలు చుట్టు ముడుతూనే ఉన్నాయి.

తెలంగాణ‌లో సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ కూడా అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఆ ఇద్ద‌రు మ‌హిళా ఉన్న‌తాధికారులే కావ‌డం విశేషం. సిగ‌ప‌ట్లు ప‌ట్టుకునేంత దాకా వెళ్లింది. ప్ర‌జ‌లకు ఆద‌ర్శంగా ఉండాల్సిన వాళ్లు బ‌హిరంగంగా స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మాట‌ల యుద్దానికి తెర లేపారు. 

వారెవ‌రో కాదు క‌ర్ణాట‌క‌కు చెందిన సీనియ‌ర్ ఉన్న‌తాధికారులు. ఒక‌రు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ , మ‌రొక‌రు సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ రోహిణి సింధూరి(Roopa Sindhuri Comment) . ఇద్ద‌రూ క‌న్న‌డ నాట గ‌త కొంత కాలం నుంచి ప‌ని చేస్తున్నారు. 

ఇద్ద‌రి మ‌ధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది. బీజేపీ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల్సిన వాళ్లు, జ‌వాబుదారీగా ఉండాల్సిన వాళ్లు , ఆద‌ర్శ ప్రాయంగా మారాల్సిన వాళ్లు ఇలా అన్నింటిని విడిచి పెట్టేశారు. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగ‌జారారు. 

చివ‌ర‌కు వీరు మాట్లాడుతున్న భాష‌ను చూసి త‌ట్టుకోలేక జ‌నం చీవాట్లు పెడుతున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క బీజేపీ స‌ర్కార్ అంతులేని అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

ఇదిలా ఉండ‌గా ఉన్న‌ట్టుండి రూపా మౌద్గిల్ బ‌హిరంగంగా తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది రోహిణి సింధూరిపై. సింధూరికి సంబంధించిన వ్య‌క్తిగ‌త ఫోటోల‌ను సామాజిక మాధ్య‌మం ఫేస్ బుక్ లో త‌న ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు , వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది రోహిణి సింధూరి. తాడో పేడో తేల్చుకుంటాన‌ని కావాల‌ని రూపా త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ దెబ్బ తీసేందుకు య‌త్నిస్తోందంటూ ఆరోపించింది. 

కాగా రూపా ప్ర‌స్తుతం రాష్ట్ర హ‌స్త క‌ళ‌ల కార్పొరేష‌న్ కు మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు. ఇక రోహిణి సింధూరి హిందూ, దేవాదాయ శాఖ‌కు క‌మిష‌న‌ర్ గా ఉన్నారు. గ‌తంలో ఆమె అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని కానీ చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఎందుక‌ని ప్ర‌శ్నించింది రూప. అంతే కాదు బ‌హిరంగంగా మీడియా ముందుకు వ‌చ్చింది. సింధూరిపై 19 అభియోగాలు మోపింది. అయితే కోడ్ ఆఫ్ కండ‌క్ట్ కింద‌కు రాదా అని నిల‌దీసింది రోహిణి. 

విచిత్రం ఏమిటంటే జ‌వాబుదారీగా ఉండాల్సిన వాళ్లు ఇలా బ‌రితెగించి తిట్టుకుంటారా..బూతులు మాట్లాడుతారా అంటూ మండిప‌డుతున్నారు ప్ర‌జ‌లు. ఈ ఇద్ద‌రి పై రాష్ట్ర హోం శాఖ మంత్రి జ్ఞానేంద్ర సీరియ‌స్ అయ్యారు. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. అంటే ప‌రిస్థితి ఎంత దాకా వ‌చ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు. 

ఈ మొత్తం వ్య‌వ‌హారం సీఎంకు ఫిర్యాదు చేసుకునేంత దాకా వెళ్లింది. సింధూరి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాను ఊరుకోన‌ని రూప‌పై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించింది. ఇక రూప డోంట్ కేర్ అంటూ ప్ర‌క‌టించింది. సీనియ‌ర్లు నోరు జార‌డం మాత్రం విస్మ‌యానికి గురి చేసింది. 

క‌న్న‌డ నాట చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ప్ర‌స్తుతం రూప‌, సింధూరి దేశంలో హాట్ టాపిక్ గా మారారు. ఇలాంటి వాళ్లు త‌మ‌కు ఎందుకు అవ‌స‌ర‌మ‌ని క‌న్న‌డిగులు ప్ర‌శ్నిస్తున్నారు.

విచార‌ణ చేప‌డితే కానీ ఎవ‌రు ఏమిట‌నేది తేలుతుంద‌ని అంటున్నారు. వారిపై చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ము రాష్ట్ర స‌ర్కార్ కు ఉందా అనేది అనుమానం వ్య‌క్తం అవుతోంది. మొత్తంగా సోష‌ల్ మీడియా కొంప‌లో కుంప‌టి ఎలా రాజేస్తుందో ఈ ఇద్ద‌రిని చూస్తే తెలుస్తుంది.

Also Read : సింధూరిపై రూప అభియోగాలు ఇవే

Leave A Reply

Your Email Id will not be published!