Rovman SA vs WI Viral : ప్రాణాలనే రిస్క్ చేసిన విండీస్ ప్లేయర్ .. వీడియో వైరల్

Rovman SA vs WI Viral : దక్షిణాఫ్రికా , వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టి20 పరుగుల వరదకు సాక్ష్యంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఏకంగా 517 పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది.

జాన్సన్ చార్లెస్ (46 బంతుల్లో 118, 10 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కైల్ మేయర్స్ (57) అర్ధ సెంచరీ చేశాడు. దాంతో విండీస్ జట్టు భారీ స్కోరును అందుకుంది. టి20ల్లో 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే అంత సులభమైన విషయం కాదు.

అయితే సౌతాఫ్రికా దానిని సాధ్యం చేసి చూపించింది. 18.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 259 పరుగులు చేసి టి20ల్లో నమోదయ్యే అతి అరుదైన విజయాన్ని సాధించింది. ఇక మ్యాచ్ లో క్వింటన్ డికాక్ (44 బంతుల్లో 100; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రీజా హెండ్రిక్స్ (68) అర్ధ సెంచరీతో అతడికి చక్కటి సహకారం అందించాడు.

అయితే ఈ మ్యాచ్ లో విండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్ (Rovman SA vs WI Viral) ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో చిన్నారి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఆడిన షాట్ కు బంతి బౌండరీ వైపు దూసుకెళ్లింది. దానిని ఆపేందుకు పావెల్ బంతి వెనకాల వేగంగా పరుగెత్తాడు. అయితే బంతి బౌండరీ సమీపించగా.. రోప్ దగ్గర 5 ఏళ్లలోపు చిన్నారి ఉన్నాడు. ఈ క్రమంలో పావెల్ ఆ చిన్నారిని ఢీ కొట్టేలా కనిపించాడు. అయితే వెంటనే ప్రమాదాన్ని ఊహించిన పావెల్ చిన్నారిని తప్పించుకుంటూ ముందుకు వెళ్లాడు.

అక్కడే సెక్యూరిటీ బాయ్ ఉన్నాడు. అతడిని కూడా తప్పించుకుంటూ బౌండరీ లైన్‌ బయట పెట్టిన ఎల్‌ఈడీ బోర్డులను గట్టిగా తాకాడు. అతడి వేగానికి ఎల్ ఈడీ బోర్డుల పైనుంచి వెళ్తూ గేట్ పై బలంగా పడ్డాడు. అయితే దీనివల్ల పావెల్ కు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, అతడి తెగువకు క్రికెట్ అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ మ్యాచ్ లో పావెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో 1 ఫోర్, 2 సిక్సర్లు ఉన్నాయి. పావెల్ ను 2022 మెగా వేలంలో రూ. 2.80 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఢిల్లీ టీంలో పావెల్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Also Read : బీసీసీఐ అప్పీల్ .. ఇండోర్ పిచ్ రేటింగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!