ప్రపంచాన్ని టెక్నాలజీ పరంగా శాసిస్తూ వస్తున్న గూగుల్ టెక్ దిగ్గజం ఉన్నట్టుండి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం దెబ్బకు మైక్రో సాఫ్ట్ , ఫేస్ బుక్ మెటా , ట్విట్టర్ , అమెజాన్ , తదితర కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ సైతం ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా సాగనంపింది. సిఇఓ సుందర్ పిచాయ్ పై నిప్పులు చెరుగుతున్నారు జాబర్స్. తమను రోడ్డు పాలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని మండిపడుతున్నారు.
తాజాగా గూగుల్ కు పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే చాట్ జీపీటీ ఎఫెక్ట్ దాని మీద పడింది. నిన్నటి దాకా కేవలం నిరసనలు, ఆరోపణలు, లేఖల ద్వారా నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన వారంతా ఇప్పుడు ఉన్నపళంగా రోడ్డెక్కారు. ఈ ఘటన లండన్ లో చోటు చేసుకుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 15 వేల మందిని తొలగించింది గూగుల్. తీసి వేసిన వారిలో ఏకంగా 12 ఏళ్లు, 15 ఏళ్లకు పైగా పని చేస్తున్న వారున్నారు.
ప్రస్తుతం రోడ్డెక్కిన ఉద్యోగులు గూగుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం కారణంగానే తాము తొలగిస్తున్నామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు గూగుల్ సిఇఓ.