PBKS vs MI IPL 2023 : చెలరేగిన ముంబై తలవంచిన పంజాబ్
మొహాలీలో పారిన పరుగుల వరద
PBKS vs MI IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో జరిగిన 46వ లీగ్ మ్యాచ్ లో పరుగుల వరద పారింది. మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన ఈ కీలక పోరులో పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ముంబై ఇండియన్స్ కలిసి 430 పరుగులు చేశాయి. బ్యాటర్లు చెలరేగి పోయారు. ఆకాశమే హద్దుగా ఆడారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ , జితేశ్ శర్మ చెలరేగారు. అనంతరం భారీ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు ముంబై ఇండియన్స్. ఓపెనర్ ఇషాన్ కిషన్ , స్టార్ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ దంచి కొట్టారు. పంజాబ్ బౌలర్ల భరతం పట్టారు. ఫోర్లు , సిక్సర్లతో రెచ్చి పోయారు.
ఇక తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ సైతం ఫినిషింగ్ టచ్ తో ఆకట్టుకున్నాడు. ఈ గెలుపుతో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ లు గెలుపొందింది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 రన్స్ చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ 42 బంతులు ఆడి 7 ఫోర్లు 4 సిక్సర్లతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జితేశ్ శర్మ కేవలం 27 బంతులు ఆడి 5 ఫోర్లు 2 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతకు ముందు శిఖర్ ధావన్ 5 ఫోర్లతో 30 రన్స్ చేస్తే మాథ్యూ షార్ట్ 2 ఫోర్లు 1 సిక్సర్ తో 27 రన్స్ చేశాడు.
అపంతనం క్రీజులోకి దిగిన ముంబై ఇండియన్స్ ఎక్కడా ఆగలేదు. పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. 18.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 216 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా , ఇషాన్ కిషణ్ 41 బంతులు ఆడి 7 ఫోర్లు 4 సిక్సర్లతో 75 రన్స్ చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 31 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లతో 66 పరుగులతో దంచి కొట్టాడు. చివర్లో వచ్చిన తిలక్ వర్మ 10 బంతులు ఆడి 1 ఫోర్ 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. టిమ్ డేవిడ్ 10 బంతులు ఆడి 19 రన్స్ చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి.
Also Read : దంచి కొట్టిన లివింగ్ స్టోన్