Brahmanandam : తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర కనబర్చిన అరుదైన నటుడు హస్యా చక్రవర్తి బ్రహ్మానందం(Brahmanandam) (కన్నెగంటి బ్రహ్మానంద చారి) కు దివంగత నటుడు, సీఎం నందమూరి తారక రామారావు స్మారక పురస్కారం లభించింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో. ఈ సందర్భంగా బ్రహ్మానందానికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇదిలా ఉండగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 35 మందికి పురస్కారాలు అందజేశారు.
తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ జీవించిన కాలం స్వర్ణ యుగమని కొనియాడారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఈ అవార్డును ఎక్స్ రే సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఏపీలోని విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు బ్రహ్మానందం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ పుట్టరని అన్నారు. ఎన్టీఆర్ తో నటించే అదృష్టం తనకు దక్కిందని, కానీ ఎక్కువ సినిమాలు చేయలేక పోయానని వాపోయారు.
ఎన్టీఆర్ మహానుభావుడని ఆయన పేరుతో అవార్డు అందుకోవడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు బ్రహ్మానందం. ఆయన జీవించిన కాలం తెలుగు సినిమాకు గర్వ కారణమని అన్నారు. నటనలో ఎన్టీఆర్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని బ్రహ్మానందం చెప్పారు.
Also Read : MI vs GT Qualifier2 IPL 2023