Jayashankar Comment : సారూ మరువం నీ జ్ఞాపకం పదిలం
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ యాదిలో
Jayashankar Comment : ఎవరు ఔనన్నా కాదన్నా ఆయన తెలంగాణ గాంధీ. సాధారణ కుటుంబంలో పుట్టిన కొత్తపల్లి జయశంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన లేకుండా తెలంగాణ లేదు. అచ్చమైన తెలంగాణ భాషకు , యాసకు, గోసకు పర్యాయ పదంగా మారి పోయిన వాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అవమానం గురించి గొంతెత్తి ప్రశ్నించిన వ్యక్తి జయశంకర్ సారు. ఇవాళ అనుభవిస్తున్న రాష్ట్రానికి చోదక శక్తి ఆయన. తన జీవిత కాలమంతా తెలంగాణ కోసం పరితపించారు. ఆయన ప్రతి మాటలో ప్రతి సందర్భంలో తెలంగాణ గురించి ప్రస్తావించాడు. భిన్నమైన పార్టీలను ఏకం చేసిన సిద్దాంతకర్త. వేలాది మందికి స్పూర్తి దాయకంగా నిలిచిన మహోన్నత మానవుడు కొత్తపల్లి జయశంకర్ . ఆయనను తెలంగాణ ప్రజలంతా గాంధీగా పిలుచుకుంటారు. వారికి ఆయన పట్ల ఉన్న గౌరవం, ప్రేమకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కన్న జయశంకర్ సారు రాష్ట్రం ఏర్పాటును చూడకుండా లోకాన్ని వీడారు. హనుకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934లో పుట్టిన జయశంకర్ . అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ సిద్దాంతకర్తగా గుర్తింపు పొందారు. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా, అంశమైనా విడమర్చి చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలలో మంచి పట్టుంది జయశంకర్(Jayashankar) సారుకు. తెలంగాణ ఉద్యమానికి తన బతుకునంతా అంకితం చేశాడు. ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ప్రిన్సిపాల్ గా , రిజిస్ట్రార్ గా పని చేశారు. ప్రతిష్టాత్మకమైన కాకతీయ యూనివర్శిటీకి ఉప కులపతిగా పని చేశారు. ఆయన చెప్పే పాఠాలు జీవిత సత్యాలు కావడంతో ప్రతి ఒక్కరూ ఆసక్తితో వినే వారు. ఆనాటి 1969 తెలంగాణ ఉద్యమంలో, నాన్ ముల్కీ, సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ నిరసనలో ఆచార్య జయశంకర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఏర్పాటులో కేసీఆర్ కు తోడ్పడ్డారు. మార్గదర్శిగా ఉన్నారు. తెలంగాణ ఎందుకు కావాలో, దేని కోసం కావాలో విడమర్చి చెప్పారు. అనేక పుస్తకాలు , వ్యాసాలు రాశారు. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలి పోయారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సారు శిష్యుల్లో ఎంతో పేరు పొందిన వారు ఉన్నారు. జయశంకర్(Jayashankar) సారు తిరగని ప్రాంతం లేదు. చెప్పని విషయం లేదు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ మారుమ్రోగేలా చేసిన ఘనత జయశంకర్ సారుదే. ఆయనకు ఉస్మానియా యూనివర్శిటీ అంటే ప్రాణం. తను చూడకుండానే వెళ్లి పోయారు. ఎప్పటికీ తెలంగాణ మదిలో మెదులుతూనే ఉంటారు ఆచార్య జయశంకర్ సారు.
Also Read : Mukesh Khanna : ఆది పురుష్ టీమ్ ను కాల్చేయాలి