TDP Janasena Comment : ఉమ్మడి పోరాటం జగన్ పై యుద్దం
పవన్ ప్రకటన మార్పు తెస్తుందా
TDP Janasena Comment : ఏపీలో ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. రాజమండ్రి వేదికగా ఆయన చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును పరామర్శించారు స్వయంగా. ఆయనతో పాటు లోకేష్ , బాలకృష్ణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గతంలో లేని రీతిలో స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా తమతో పాటు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ ఆలోచిస్తుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.
TDP Janasena Comment Viral
ఆయన మొత్తంగా వైసీపీనీ, సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. అంతే కాదు మోస్ట్ డేంజరస్ క్రిమినల్ అని, సీఎం కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక నుంచి ఉమ్మడి కార్యాచారణ ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీ(Janasena Party) ఏర్పాటు చేసిన నాటి నుంచి ఆచి తూచి అడుగులు వేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. అంశాల వారీగా మద్దతు ప్రకటించారు. ఏపీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రంలో బీజేపీకి , ఆనాడు చంద్రబాబు పార్టీకి సపోర్ట్ చేశానని తెలిపారు. ఇదంతా కేవలం రాష్ట్రం కోసమేనని వెల్లడించారు. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న టీడీపీ(TDP), బీజేపీ, జనసేన కలిస్తే అధికారంలో ఉన్న పార్టీకి కొంత ఇబ్బంది కలిగే ప్రమాదం లేక పోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది తమకు తెలుసని , తనను , తన పార్టీని ఎలా నడపాలో ఏనాడైనా చెప్పానా అంటూ సెటైర్ వేశారు.
ఈ సందర్బంగా ఒకరి అరెస్ట్ ను ఆసరాగా చేసుకుని సంబురాలు ఎలా చేసుకుంటారంటూ ప్రశ్నించారు. మొత్తంగా చంద్రబాబుతో పొత్తు ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. నిన్నటి దాకా కొనసాగుతూ వచ్చిన సస్పెన్స్ కు తెర దించారు పవన్ కళ్యాణ్. ఆయన ఎప్పుడూ లేనంతగా తన వాయిస్ ను పెంచారు. ఎంతో ముందు చూపు (విజన్ ) కలిగిన చంద్రబాబు ఈ సమయంలో రాజమండ్రి జైలులో ఉండడం ప్రమాదకరమన్నారు. ఏపీలో ఏమైనా అనిశ్చితి చోటు చేసుకుంటే ఆ ప్రభావం దేశంపై పడుతుందని తాను ఆవేదన చెందుతున్నానని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని అన్నారు. ఎలాంటి కక్ష సాధింపు ధోరణి ఉండదన్నారు. తాను తెగించి వచ్చానని, సింహాలను తట్టుకునే శక్తి ఉందని ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొత్తంగా టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగితే, దానికి బీజేపీ తోడైతే ఏం జరుగుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : Delhi Liquor Scam : కవితకు షాక్ ఈడీ సమన్లు