CM KCR Comment : బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే తన మాట తనే వినని మొండి ఘటం. అపారమైన అవగాహన, తెలంగాణతో పాటు దేశం గురించిన సమాచారం అమ్ముల పొదిలో నిక్షిప్తమై ఉంటుంది. కేసీఆర్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. ఇక చట్టాల గురించి ప్రత్యేకించి పరిపాలనా పరమైన అంశాల గురించి పూర్తి పట్టు కలిగి ఉన్నారు. అంతే కాదు గంటల తరబడి ఏ అంశం గురించైనా అనర్ఘలంగా ప్రసంగించే సత్తా కలిగిన నేతలలో తను ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తిమ్మిని బమ్మి చేయడంలో, ప్రతిపక్షాలకు ఊహించని రీతిలో ఝలక్ ఇవ్వడంలో , తను అందరికంటే ముందు ఉండడంలో కేసీఆర్(CM KCR) ఇప్పటి వరకు సక్సెస్ అయ్యాడు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని, హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్నాడు. ఆ దిశగా గత నాలుగు ఏళ్ల నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు.
CM KCR Comment Viral
ఈ ఏడాది డిసెంబర్ 3న తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. కానీ గతంలో తెలంగాణ సెంటిమెంట్ ను ప్రధానంగా వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు సీఎం. ప్రస్తుతం ఆ సీన్ కనిపించడం లేదు. జనం ప్రత్యేకించి యూత్ ఎక్కువగా తీవ్ర వ్యతిరేకతతో ఉండడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఏ సభకైనా వచ్చిన సందర్బంలో తను లీడ్ చేస్తూ ఉత్సాహంతో ఉరకలెత్తించేలా మాట్లాడుతూ వచ్చే వారు. కానీ ఎందుకనో అచ్చంపేట లో జరిగిన విజయోత్సవ భారీ బహిరంగ సభలో సంచలన కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలను సన్నాసులని తిడుతూనే ఓడిస్తే నాకేం కాదు నేను హాయిగా విశ్రాంతి (రెస్ట్ ) తీసుకుంటా. కానీ నష్టం జరిగేది మీకేనంటూ వైరాగ్యం ప్రతిఫలించేలా మాట్లాడటం కలకలం రేపింది. ఇక దేశంలోని ప్రధాన సంస్థలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు సర్వే సంస్థలన్నీ ఒకటి రెండు తప్పా గంప గుత్తగా కాంగ్రెస్ దూసుకు వస్తోందని, కనీసం 60 నుంచి 70 స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొంటున్నాయి.
మరో వైపు బీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలి ఆ పార్టీకి శాపంగా మారిందన్న ఆరోపణలు లేక పోలేదు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు భర్తీ చేయక పోవడం, పరీక్షల నిర్వహణలో అవినీతి, ఆరోపణలు లెక్కకు మించి రావడం, లక్షా 20 వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడం , లెక్కకు మించి మద్యం షాపులకు పర్మిషన్స్ ఇవ్వడం సర్కార్ కు షాక్ ఇవ్వనున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తన జీవిత ప్రస్థానంలో ఏ కోశాన ఓటమిని ఒప్పుకోని నైజం కేసీఆర్(CM KCR) ది. ఆయన ఏమీ లేక పోయినా ఉండగలరేమో కానీ పదవి లేకుండా ఉండలేరు. మరి అధినేతలో ఇంతటి నైరాశ్యపు మాటలు రావడం దేనికి సంకేతమనేది ప్రశ్నార్థకంగా మారింది. గులాబీ జెండా రెప రెప లాడుతుందా లేక హస్తం హవా కొనసాగుతుందా కమలం వికసిస్తుందా అన్నది వేచి చూడాలి.
Also Read : Ponguleti Srinivas Reddy : కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే బెటర్