AP Final Voter List: ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం !

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం !

AP Final Voter List: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం(CEC) సోమవారం విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఈసీ అప్ లోడ్ చేసినట్లు తెలిపింది. ఈ ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే ప్రదర్శించాలని కలెక్టర్లకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన 2024 ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 2,00,09,275 మంది ఉండగా… మహిళలు 2,07,37,065 మంది ఉన్నారు. థర్డ్ జెండర్స్‌ 3,482… సర్వీస్ ఓటర్లు 67,434 మంది ఉన్నారు.

AP Final Voter List – ఎన్నికల సన్నద్ధతపై సీఎస్‌ సమీక్ష !

ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారుల బదిలీల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో జనవరి 31లోగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై ఆయన సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు తదితర అంశాలపైనా కూడా ఈ సమావేశంలో సీఎస్ చర్చించారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు సమావేశానికి హాజరయ్యారు.

యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తాం !

ఏపీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన అనతరం సీఈఓ(CEO) ముఖేష్ కుమార్ మీనా సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత 5.08 లక్షల ఓటర్లు పెరిగారని ఆయన పేర్కొన్నారు. యువ ఓటర్లు 8.13 లక్షల ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. యువ ఓటర్లు ఇంకా నమోదు కావాల్సి ఉందని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తామని అన్నారు. ఒకే డోర్ నెంబర్‌పై అధిక ఓట్లు ఉన్న ఫిర్యాదులను 98 శాతం పరిష్కరించామని తెలిపారు.

లక్ష 50 వేల ఇళ్లలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 4వేల ఇళ్లకు తగ్గాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి ఓట్లు ఉండేవని అన్నారు. ఫామ్ 7 ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 70 చోట్ల పోలీసు కేసులు నమోదు చేశామని అన్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వికలాంగులు, 80 ఎళ్ల పైబడిన వారికి ఇంటి వద్ద ఓటింగ్‌కి అవకాశం ఇస్తామని అన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు.

Also Read : YS Sharmila Dharna: విశాఖలో వైఎస్ షర్మిల మెరుపు నిరసన !

Leave A Reply

Your Email Id will not be published!