N Chandrababu Naidu: ఏపీ డీజీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
ఏపీ డీజీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !
N Chandrababu Naidu: మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసారు. ఏపీలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై… ఊరూరా జగన్ గూండా రాజ్ నడుస్తోందని ధ్వజమెత్తారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం పూర్తిగా గాడి తప్పిన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మార్టూరులో మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా ? అని దుయ్యబట్టారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండా రాజ్‌కు ఉదాహరణగా నిలుస్తోందన్నారు… ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి అరెస్టు చేసినందుకు సిగ్గుపడాలన్నారు. క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు వందల మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా… పోలీసులు సహకరించారని చంద్రబాబు(N Chandrababu Naidu) ఆరోపించారు.
N Chandrababu Naidu Comment
రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించనప్పుడు డీజీపీ ఉండి దేనికని ప్రశ్నించారు. ఆ డీజీపీ పోస్టులో కూర్చోవడానికి రాజేంద్రనాధ్ రెడ్డి అనర్హులని విమర్శించారు. ఒకప్పుడు దేశం కీర్తించిన రాష్ట్ర పోలీసు శాఖ… కళ్ల ముందే పతనం అవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకోవాలని డిమాండ్ చేసారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు… అరాచకాలకు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫాం తీసేసి వైకాపా జెండానే యూనిఫాంగా కుట్టించుకోవాలన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు… చట్టానికి కట్టుబడి పనిచేయాలని హితవు పలికారు. తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు హెచ్చరించారు.
Also Read : YS Sharmila Security: వైఎస్ షర్మిల భద్రతపై కాంగ్రెస్ నేతల ఆందోళన !