Tirupati By-election Case: తిరుపతి దొంగ ఓట్లు కేసులో పోలీసులపై ఈసీ కొరడా !

తిరుపతి దొంగ ఓట్లు కేసులో పోలీసులపై ఈసీ కొరడా !

Tirupati By-election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో దొంగఓట్ల వ్యవహారంలో ఎన్నికల సంఘం పోలీసులపై కొరడా ఝళిపించింది. దొంగఓట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి తిరుపతి నగర తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్‌రెడ్డి , శివప్రసాద్‌పై వేటు వేసింది. తూర్పు పీఎస్‌ ఎస్సై జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్‌ ద్వారకానాథ్‌రెడ్డిని సస్పెండ్‌ చేసింది. అప్పటి అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ను వీఆర్‌కు బదిలీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Tirupati By-election Case Updates

తిరుపతి ఉప ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అక్రమంగా ఎపిక్ కార్డులను డౌన్ లోడ్ చేయడంతో పాటు వాటి ఆధారంగా దొంగ ఓట్లను సృష్టించారు. ఈ నేపథ్యంలో దొంగఓట్లు వేయడానికి ప్రయత్నించిన వారిపై… టీడీపీ(TDP), బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళ మేరకు ఆ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారనే ఆరోపణలు పోలీసులపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎపిక్‌ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల సమయంలో తిరుపతి కార్పోరేషన్ కమీషనర్ గా పనిచేస్తున్న గిరీషా యొక్క డిజిటల్ లాగిన్ ను కొంతమంది అధికార పార్టీ నేతలు దుర్వినియోగం చేసి సుమారు 30 వేలకు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్ లోడ్ చేసారని ఆరోపిస్తూ బిజేపి(BJP) నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో ఎపిక్ కార్డుల అక్రమ డౌన్ లోడ్ పై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు… అప్పటి ఆర్వో, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా యొక్క డిజిటల్ లాగిన్ దుర్వినియోగం అయినట్లు నిర్దారించారు. వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ… సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో అధికారి ప్రస్తుతం విజయవాడ మెప్మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా ఉన్న చంద్రమౌళీశ్వర్‌ రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది జరిగి మూడు రోజులు గడవకముందే… ఐదుగురు పోలీసు అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైకాపా 34 వేల దొంగ ఓట్ల ఎపిక్‌ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు, ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఎపిక్‌ కార్డుల ఆధారాలు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసి వేసిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : Balka Suman: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసుల నోటీసులు !

Leave A Reply

Your Email Id will not be published!