Jaya Prakash Narayana: ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా మద్దతు !
ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా మద్దతు !
Jaya Prakash Narayana: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన (ఎన్డీయే) ల కూటమికి మద్దతిస్తున్నట్టు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా ? అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా ? అనే సందేహం ఉంది. నిర్భయంగా నమ్మిన వారికి ఓటు వేయండి. సామాన్యుల జీవితాలు మారాలంటే అభివృద్ధి చూసి ఓటేయాలి. సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటించాలి. ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరని ఆలోచించాలి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నేతలు ఆడుకుంటున్నారు’’ అని జేపీ వ్యాఖ్యానించారు.
సుపరిపాలన అంటే సంక్షేమం మాత్రమే కాదన్నారు. అభివృద్ధి చేస్తేనే మంచి పాలన ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కోసం ఖర్చు చేయడం సరికాదని జేపీ సూచించారు. సంక్షేమమే పాలన అనుకుంటే ఆ దేశం, రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయం అని హెచ్చరించారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు. పేదరికం సమూలంగా వెళ్లిపోవాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. సంక్షేమం అంటే తాత్కాలిక ప్రయోజనాలు అని, అభివృద్ధి అంటే దీర్ఘకాలిక సంపద సృష్టించడం అని జయప్రకాశ్ నారాయణ(Jaya Prakash Narayana) వివరించారు. ఉపాధి కల్పించి, పెట్టుబడులు అందజేసి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రగతి మాట లేకుండా పోయింది. ఐదేళ్లలో ఏపీ పేరు దిగజారిపోయింది. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి వచ్చింది. దోపిడీ చేస్తూ… సంక్షేమ పథకాలు అమలు చేశామని చెబుతున్నారు. ప్రజా పాలన ఇది కాదు అని’ జేపీ ధ్వజమెత్తారు.
Jaya Prakash Narayana – ఒడిశా కన్నా దారుణంగా ఏపీ పరిస్థితి !
ఒడిశా కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని జేపీ మండిపడ్డారు. ‘ఒడిశాలో రూ.26 వేల కోట్ల రెవెన్యూ ఉంది. అవసరం మేరకు అప్పులు చేస్తారు. హంగు లేదు… ఆర్బాటం లేదు. ప్రచారం అంతకన్నా లేదు. ఆర్థికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన సుపరిపాలన అందుతోంది. సంస్కరణలు సాధ్యం కాదు అనేవారు అవినీతి పరులు, అసమర్థులు. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి రెవెన్యూ పెంచుకోలేక పోయారు. కుల, మతం, హింస రాజ్యమేలిన ఉత్తర ప్రదేశ్ తీరు కూడా మారింది. ఏపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది అని’ జేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read : C. P. Radhakrishnan: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం !