BJP MP K Laxman: కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు !
కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు !
BJP MP K Laxman: నియంతృత్వాన్ని పాటించే వాళ్లు తమ నీడను కూడా నమ్మరని… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఎవ్వరినీ నమ్మడం లేదని… అందుకే రాజకీయ, మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(BJP MP K Laxman) సంచలన ఆరోపణలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని విమర్శించారు. గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ‘‘కేంద్ర హోం శాఖ అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో హార్డ్ డిస్కులు, సమాచారాన్ని ధ్వంసం చేశారు. రెండో, మూడో ఫోన్ ట్యాపింగ్‌లు జరిగితే జరగవచ్చని కేటీఆర్ అంటున్నారు. దీనికి మూల కారకులు కేసీఆర్, కేటీఆర్. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి దీనిపై సీబీఐ విచారణ చేయించాలి. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ఆ కుటుంబానికి ప్రమేయముంది. తెలంగాణ సంపదను దోచుకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
BJP MP K Laxman Comments
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కదలలేదు. సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు. గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో స్కామ్‌లు చేశారు.. కమీషన్లు తీసుకున్నారు. ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేశారు. నియంతృత్వ పోకడలు సాగించారు. కక్ష సాధింపులో భాగంగా పలువురిపై ఫోన్ ట్యాపింగ్ చేశారు. అసెంబ్లీ, ఉప ఎన్నికల సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిచారు. ఈ కుంభకోణంలో కొంత మంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జనకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించింది. ఇది తీవ్రమైన నేరం’’ అని లక్ష్మణ్ ఆరోపించారు.
Also Read : Punjab CM : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంట జన్మించిన మహాలక్ష్మి