Suneetha Narreddy: సీఎం జగన్‌ కు వివేకా కుమార్తె సునీత స్ట్రాంగ్ కౌంటర్ !

సీఎం జగన్‌ కు వివేకా కుమార్తె సునీత స్ట్రాంగ్ కౌంటర్ !

Suneetha Narreddy: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ప్రొద్ధుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తీవ్రంగా స్పందించారు. హంతకులకు ఓటు వేయవద్దని ఆమె మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీత(Suneetha Narreddy) మాట్లాడుతూ… ‘‘చిన్నాన్న అంటే అర్థం తెలుసా ? నాన్న తర్వాత నాన్న… అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. పైగా.. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా ? మీ చెల్లి కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి ? బంధుత్వాలకు అర్థం తెలుసా ? చిన్నాన్నను ఎవరు చంపారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. అవును మీరు నిజమే చెప్పారు. వివేకాను చంపించింది ఎవరో… దేవుడికి, మీకు, జిల్లా ప్రజలకు తెలుసు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Suneetha Narreddy Comment

నా తండ్రిని చంపిన హంతకుడే చెబుతున్నాడు… వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డే వివేకాను హత్య చేయించారని. ఒకరు చెప్పింది నమ్ముతున్నారు.. ఇంకొకరు చెప్పింది నమ్మడం లేదు. ఐదేళ్లు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేశారు ? నిందితులను రక్షించేది మీరు కాదా ? గతంలో సీబీఐ విచారణ కోరింది మీరే… ఆ తర్వాత పిటిషన్‌ ఉపసంహరించుకున్నదీ మీరే. ఎన్నికలు వస్తున్నాయని ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా ? మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే బయటకు రావాల్సి వచ్చింది. ఎవరు స్వార్థపరులు ? ఎవరు పదవుల కోసం హత్య కేసును వాడుకుంటున్నారు అని ఆమె సీఎం జగన్ ను ప్రశ్నించారు.

హంతకులకు ఓటు వేయమని మీరు అడుగుతున్నారు. సినిమాలో రౌడీలు ఉంటారు. విలన్‌ ఉంటాడు. కేవలం రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా ? విలన్‌ ను కూడా పట్టుకోవాలి కదా. చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు అవుతోంది. సానుభూతి పొంది ఎన్నికల్లో ఓట్ల కోసం పాకులాడుతున్నారు. తండ్రిని కోల్పోయి నేను న్యాయం కోసం పోరాడుతున్నా. హంతకులకు ఓటు వేయవద్దని మరోసారి ప్రజలను కోరుతున్నా. పదవుల కోసమని నాపై ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం నేను పోరాడుతున్నా. సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను జగన్‌ తెరపైకి తెస్తున్నారు. వైసీపీ పునాదులు వివేకా రక్తంలో మునిగి ఉన్నాయి’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : BJP MP K Laxman: కేసీఆర్‌ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!