UNESCO: అస్సాం అహోమ్‌ రాజవంశీకుల సమాధులకు యునెస్కో వారసత్వ హోదా !

అస్సాం అహోమ్‌ రాజవంశీకుల సమాధులకు యునెస్కో వారసత్వ హోదా !

UNESCO: అస్సాంలో అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపదగా ఈ సమాధులు రికార్డులకెక్కాయి. భారత్‌లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అస్సాంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మోయిదమ్‌ అంటారు. 600 ఏళ్లపాటు అస్సాంను పాలించిన టాయ్‌-అహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్‌ దేవ్‌లో మట్టితో పిరమిడ్‌ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. ఈ సమాధి దిబ్బలపై పచ్చగడ్డి పెరిగి హరిత కవర్ణం సంతరించుకుంది.

వారసత్వ కట్టడం హోదా కోసం మోయిదమ్‌లు నామినేషన్ పత్రం దశాబ్దం క్రితం పంపించారు. యునెస్కో(UNESCO) గుర్తింపు రావడంపై సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ… ఇవాళ సువర్ణాక్షరాలతో లిఖితమవుతుందని అన్నారు. యునెస్కోకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మోయిడమ్స్ ప్రాధాన్యతను అర్థం చేసుకున్నందుకు యునెస్కో, ప్రపంచ వారసత్వ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

సీఎం హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ… “మొయిదమ్‌లు యునెస్కో(UNESCO) ప్రపంచ వారసత్వ జాబితాలో సాంస్కృతిక ఆస్తి. యునెస్కో గుర్తింపు రావడం అసోం సాధించిన గొప్ప విజయం. ఈశాన్య భారత దేశం నుంచి ఈ గుర్తింపు పొందడం తొలిసారి. కజిరంగా, మనస్ నేషనల్ పార్కుల తర్వాత, ఇది అస్సాం మూడవ ప్రపంచ వారసత్వ సంపాదగా నిలిచింది” అని హిమంత అన్నారు.

UNESCO – మోయిదమ్స్ అంటే ?

అసోంలోని పట్కై పర్వత శ్రేణుల దిగువ ప్రాంతంలో ఏర్పాటైన ఈ ప్రదేశంలో తాయ్-అహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్‌ దేవ్‌లో మట్టితో పిరమిడ్‌ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేసేది. ఈ సమాధులను ప్రకృతి విధ్వంసం జరగకుండా, ఇటుక, రాయితో ఓ సొరంగం మాదిరి నిర్మించారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇప్పటి వరకు 168 దేశాలలో 1,199 ప్రదేశాలు, కట్టడాలను యునెస్కో జాబితాలో చేర్చింది. భారత్‌లో 43 ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు ఉంది.

Also Read : NITI Aayog : నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాక్ అవుట్ చేసిన బెంగాల్ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!