Minister Ponguleti : విద్య వైద్యం కు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది
కాగా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి...
Minister Ponguleti : నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత పేదలు, రైతుల పక్షపాతిగా ఉందని, 31 వేల కోట్ల రూపాయలు రుణ మాపీ చేస్తుందన్నారు.
Minister Ponguleti Comment
ధరణి వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆనాడు గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతలు ధరణిపై అబద్ధాలు చెపుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti) మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దరణిని ప్రక్షాళన చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4 లక్షల 50 వేల ఇళ్లు కట్టబోతున్నామని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చారని, గత ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు పంచుతామని స్పష్టం చేశారు. ఏడు నెలలు పూర్తి కాకుండానే ఏం చేయలేదని ప్రతి పక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని, గత ప్రభుత్వ పాలనలోనే ఆత్మహత్యలు జరిగాయని, కాంగ్రెస్ వచ్చింది కాబట్టే కరెంటు, నీళ్లు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, మంచి పరిపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఆడబిడ్డలు, రైతన్నల ముఖాల్లో ఆనందం చూడలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
కాగా లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత నాలుగేళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడు నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తుల సమస్య పరిష్కారంపై ఇరవై రోజుల వ్యవధిలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం, తాజాగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడాన్ని బట్టి ఈ అంశానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందన్నది స్పష్టం చేస్తోంది. మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది.
ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి తక్షణం ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సుమారు రూ.10 వేల కోట్ల దాకా ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎల్‌ఆర్‌ఎస్(LRS) దరఖాస్తుల పరిశీలనకు ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లేవని స్పష్టమైంది. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి ఈ ప్రక్రియపై ఎలాంటి స్టేలు లేవని వెల్లడైంది. దీంతో ఈ అంశంపై కింది స్థాయి అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి.. నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించింది.
ఎల్‌ఆర్‌ఎస్(LRS) పథకం కింద ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం నాటి ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలలపాటు దరఖాస్తులను స్వీకరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 3.58 లక్షల దరఖాస్తులు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల నుంచి 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల నుంచి 6 లక్షల దరఖాస్తులు, అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల నుంచి 1.35 లక్షల దాకా దరఖాస్తులు అందాయి.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 131 ప్రకారం ప్లాట్ యజమాని వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే రూ.1000 ఫీజు చెల్లించాలని, లేఅవుట్ డెవలపర్ దరఖాస్తు చేస్తే (ఎన్ని ప్లాట్లు ఉన్నా) రూ.10 వేలు ఫీజుగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే దీనిని సవాలు చేస్తూ జువ్వాడి సాగర్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై హైకోర్టు నుంచి గానీ, సుప్రీంకోర్టు నుంచి గానీ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి రాకపోవడంతో పురపాలక శాఖ 2023 మే 20న (లెటర్ నంబరు 14148/పీఎల్‌జీ.111/2020) ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.
Also Read : Minister Srinivasa Varma : సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి శరవేగంగా సాగుతుంది