MLA Jagadish Reddy : పంటలు ఎండిపోతున్న సర్కారు పట్టించుకోవడం లేదు
శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న సమాచారం తమకు ఉందని అన్నారు...
MLA Jagadish Reddy : తెలంగాణలో గత 8 నెలలుగా పరిపాలన పడకేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదని విమర్శించారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందని ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… గత యాసంగి (రబీ) పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు అందించ లేకపోయిందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ పాలనలో యాసంగిలోనే భారీగా దిగుబడి వచ్చిందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి లక్షలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోందని చెప్పారు. ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని కానీ ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని జగదీశ్వర్ రెడ్డి(MLA Jagadish Reddy) ప్రశ్నించారు.
MLA Jagadish Reddy Comment
శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తాయన్న సమాచారం తమకు ఉందని అన్నారు. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు కూడా ఖాళీగా ఉందని.. ఆ రిజర్వాయర్ సహా దాని కింద ఉన్న చెరువులు నింపాల్సిన అవసరం ఉందని తెలిపారు. కృష్ణా నది నీటిని కిందికి వదిలి సముద్రం పాలు చేస్తున్నారని జగదీశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాళేశ్వరం మోటార్లతో నీటిని ఎత్తిపోసి సూర్యాపేట వరకు నీటిని తీసుకురావాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చు అని కాంగ్రెస్ నేతలు అన్నారని మరి ఎస్సారెస్పీ నుంచి ఎందుకు సూర్యాపేటకు నీరు ఇవ్వడం లేదు? అని నిలదీశారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు నీళ్లు ఇవ్వలేక నిందను, నెపాన్ని కాళేశ్వరంపైకి నెట్టేస్తున్నారని విమర్శించారు. సుందిళ్ల, అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలి. తద్వారా వరంగల్, సూర్యాపేటకు నీళ్లు ఇవ్వాలని జగదీశ్వర్ రెడ్డి(MLA Jagadish Reddy) డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించామని అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసేందుకు సమయం అడిగామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.
Also Read : Bangladesh PM Resign : రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన ప్రధాని షేక్ హసీనా