Manish Sisodia: జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోదియా ! నేరుగా కేజ్రీవాల్ ఇంటికి !

జైలు నుంచి విడుదలైన మనీశ్ సిసోదియా ! నేరుగా కేజ్రీవాల్ ఇంటికి !

Manish Sisodia: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సీనియర్‌ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్‌ తో ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో 17 నెలలుగా తిహాడ్‌ జైలులో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. అంతకుముందు సిసోదియాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన 38 పేజీల తీర్పులో జస్టిస్‌ బి.ఆర్‌.గవయ్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘బెయిల్‌ అనేది నియమం..జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్‌ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. విచారణ జరపకుండా నిందితులను దీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచడం సత్వర న్యాయం పొందే హక్కును వారికి అందకుండా చేయడమేనని ట్రయల్‌ కోర్టుపై మండిపడింది. నేర నిర్ధారణకు ముందే విచారణలేకుండా నిందితుడిని శిక్షించటానికి అనుమతించరాదని స్పష్టం చేసింది.

గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish Sisodia)ను అరెస్టు చేయగా, ఆ తర్వాత కొన్ని రోజులకు ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అరెస్టయిన రెండు రోజుల తర్వాత ఉపముఖ్యమంత్రి పదవికి సిసోదియా రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా జైల్లోనే ఉన్నారు. ఆయన బెయిల్‌ అభ్యర్థనలు పలుమార్లు తిరస్కరణకు గురికావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఆర్‌.గవయ్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు హామీలను తీసుకుని సిసోదియాను జైలు నుంచి విడుదల చేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. ఈ సందర్భంగా సిసోదియాకు కొన్ని షరతులు విధించింది. నిందితుడు తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్‌కోర్టుకు అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ప్రతి సోమవారం, గురువారం ఉదయం దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది.

‘ఏ నిందితుడినీ కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరు. కేసు విచారణలో పురోగతి లేకపోయినా… ఒక పరిమితి దాటిన తర్వాత ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదు. అలాకాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుంది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం నిందితుల హక్కు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) సమాజంలో బలమైన సంబంధాలు ఉన్న వ్యక్తి అని, ఆయన విదేశాలకు పారిపోయే అవకాశమే లేదని అభిప్రాయపడింది. సిసోదియా బెయిల్‌ అభ్యర్థనలను తోసిపుచ్చుతూ మే 21న దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సిసోదియా తరఫు న్యాయవాదులు ఢిల్లీలోని ప్రత్యేక ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ బాండ్లను, హామీ పత్రాలను సమర్పించారు. జడ్జి కావేరీ బవేజా వాటిని ఆమోదించడంతో తిహాడ్‌ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం సిసోదియా విడుదలయ్యారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వల్లే తాను బెయిల్‌పై రాగలిగానని తిహాడ్‌ జైలు నుంచి వెలుపలికి వచ్చిన సిసోదియా అన్నారు. ఇదే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా త్వరలోనే విడుదలవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో వర్షం కురుస్తున్నా భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆప్‌(AAP) కార్యకర్తలు, నాయకులు తమ నేత సిసోదియా(Manish Sisodia)కు ఆనందోత్సాహాల మధ్య నినాదాలతో స్వాగతం పలికారు. ఆయనను తమ భుజాలపై మోస్తూ స్వాగతం పలికారు.

Manish Sisodia – భావోద్వేగంతో ఆప్ మంత్రి ఆతిశీ కన్నీళ్లు !

సిసోదియాకు బెయిల్‌ మంజూరుకావడంపై ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ భావోద్వేగానికి గురయ్యారు. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో సిసోదియా శంకుస్థాపన చేసిన ఓ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆతిశీ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సిసోదియాకు బెయిల్‌ మంజూరైన విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ… ‘‘ఈ రోజు నిజం గెలిచింది. ఢిల్లీ విద్యార్థులు గెలిచారు. పేద పిల్లలకు సిసోదియా మెరుగైన విద్యను అందించడం, ఉజ్వల భవిష్యత్తు కల్పించడం కొందరికి నచ్చలేదు. అందుకే తప్పుడు కేసులో జైలుకు పంపించారు’’ అని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు.

జైలు నుంచి నేరుగా కేజ్రీవాల్‌ ఇంటికి సిసోదియా !

మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన మనీశ్‌ సిసోదియా వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను, వారి కుటుంబ సభ్యులను కలిశారు. కేజ్రీవాల్‌ కూడా త్వరలోనే జైలు నుంచి విడుదలవుతారంటూ వారికి భరోసానిచ్చారు. మద్యం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తిహాడ్‌ కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే.

సిసోదియాకు బెయిల్‌ లభించడంతో దిల్లీలోని ఆయన నివాసంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సిసోదియా సతీమణి సీమా సిసోదియా, కుటుంబ సభ్యులు తమ ఇంటికి వచ్చిన వారికి మిఠాయిలు పంచారు. ఆప్‌(AAP) కార్యకర్తలు డీడీయూ మార్గ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని డప్పులు మోగిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు మిఠాయిలు పంచారు. సిసోదియాకు బెయిల్‌ లభించడాన్ని సత్యానికి దక్కిన విజయంగా పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

భార్యతో టీ తాగుతూ… మనీష్‌ సిసోడియా భావోద్వేగ సెల్ఫీ

లిక్కర్‌ కేసులో అరెస్టయి పదిహేడు నెలల తర్వాత తీహార్‌ జైలు నుంచి విడుదలైన మనీష్‌ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం తీహార్‌ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం(ఆగస్టు10) ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి టీ తాగుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రాన్ని ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ‘17 నెలల తర్వాత.. ఫస్ట్‌ మార్నింగ్‌ టీ ఆఫ్‌ ఫ్రీడమ్‌. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ’అని తన ట్వీట్‌కు సిసోడియా భావోద్వేగపూరిత కామెంట్స్‌ జత చేశారు.

Also Read : Pawan Kalyan: పంద్రాగస్టు వేడుకలు వేళ పంచాయితీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ !

Leave A Reply

Your Email Id will not be published!