Thailand PM : ‘స్రెట్టా థావిసిన్’ ను థాయిలాండ్ ప్రధాని పదవి నుంచి తప్పించిన కోర్ట్

రాజ్యాంగ న్యాయస్థానం గత 16 ఏళ్లలో తొలగించిన ప్రధానుల్లో రియల్ ఎస్టేట్ టైకూన్ స్రెట్రా నాలుగో వ్యక్తి...

Thailand PM : థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ను పదవి నుంచి రాజ్యాంగ కోర్టు బుధవారంనాడు తొలగించింది. ఒక న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో జైలుశిక్ష అనుభవించిన పిచత్ చుయెన్‌బాన్‌ను తన మంత్రివర్గంలోకి ప్రధాని స్రెట్రా(Thailand PM) తీసుకోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగంపై స్రెట్టా థావిసిన్‌ను పదవి నుంచి తొలగిస్తూ, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కొత్త ప్రధానమంత్రి నియామకానికి పార్లమెంటు ఆమోదం లభించేంత వరకూ ఆపద్ధర్మ పద్ధతిలో ప్రస్తుత క్యాబినెట్ కొనసాగుతుందని పేర్కొంది.

రాజ్యాంగ న్యాయస్థానం గత 16 ఏళ్లలో తొలగించిన ప్రధానుల్లో రియల్ ఎస్టేట్ టైకూన్ స్రెట్రా నాలుగో వ్యక్తి. రెండు దశాబ్దాల కాలంలో పలు రాజకీయ తిరుగుబాట్లు, కోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పతనమైన నేపథ్యంలో థాయ్‌లో తాజా పరిణామంతో మరింత అనిశ్చితి నెలకొంది. ఏప్రిల్‌లో మంత్రివర్గాన్ని స్రెట్రా విస్తరించారు. పిచిత్ చుయెన్‌బాన్‌ను తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఇది విమర్శలకు దారితీసింది. 2008లో న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో ఆరు నెలల పాటు చుయెన్‌బాన్‌ జైలు శిక్ష అనుభవించారు. ప్రధానమంత్రిగా తన క్యాబినెట్ సభ్యుడి అర్హతలను పరిశీలించకుండా క్యాబినెట్‌లోకి ప్రధాని తీసుకోవడం నైతిక ఉల్లంఘనలకు పాల్పడడమేనని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

Thailand PM…

కాగా, తన పదవిచ్యుతిపై స్రెట్రా స్పందించారు. అనైతకతకు పాల్పడిన ప్రధానిగా పదవి నుంచి వైదొలగాల్సి రావడం విచారకరమని అన్నారు. తాను పూర్తి నిబద్ధత, నిజాయితీతో విధులను నిర్వహించినట్టు ఆయన చెప్పారు. 62 ఏళ్ల స్రెట్రా గత ఆగస్టులో థాయ్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, స్రెట్రా పదవిని కోల్పోవడంతో ఆయన స్థానంలో వాణిజ్య శాఖ మంత్రి, ఉప ప్రధాని పుంతమ్ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.

Also Read : Bangladesh Crisis : 12 ఏళ్ల గరిష్టానికి బంగ్లాదేశ్ ద్రవ్యోల్బణం

Leave A Reply

Your Email Id will not be published!