GHMC Commissioner : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి పర్యటించాలి

వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు...

GHMC Commissioner : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(IAS Amrapali) ఆదేశించారు. పౌరులు క్యాచ్‌పిట్లు, మ్యాన్‌హోల్‌ మూతలు తెరవవద్దని సూచించారు. మెహిదీపట్నం, ఆసిఫ్‏నగర్‌, గుడి మల్కాపూర్‌, విజయనగర్‌ కాలనీ, మాసాబ్‌ట్యాంక్‌ తదితర ప్రాంతాల్లో మంగళవారం ఆమె పర్యటించారు. అనంతరం జోనల్‌, డిప్యూటీ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రధాన రహదారులపై వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టుల పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాలు పడిన సమయంలో అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని, పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు.

GHMC Commissioner Amrapali..

వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. వరదతో ఇబ్బందులున్న వారు 040 2111 1111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని బల్దియా ఓ ప్రకటనలో కోరింది. వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జోనల్‌ కమిషనర్లను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆదేశించారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో వెంటనే ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో భారీ వర్షాలపై రెవెన్యూ, విద్యా, వైద్య, అగ్నిమాపక శాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రానున్న ఐదు రోజుల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల వద్ద ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వర్షాలు అధికంగా కురిసే ప్రాంతాల్లోని పాఠశాలలకు ముందస్తు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో లా ఆఫీసర్‌ వీరబ్రహ్మచారి, సీపీఓ సురేందర్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకట్‌, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి వడ్డెన్న, డీఈఓ రోహిణి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకన్న, ఆర్డీఓలు మహిపాల్‌, దశరథ్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైన చోట్ల క్లోరిన్‌ బిళ్లలు పంపిణీ చేయాలని, కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో.. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. మ్యాన్‌హోళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని నగర పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే.. వాటర్‌బోర్డు కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ నంబర్‌ 155313కి ఫోన్‌ చేయాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో వాటర్‌బోర్డు అప్రమత్తమైంది. మంగళవారం వాటర్‌బోర్డు ఉన్నతాధికారులతో పాటు జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ఎండీ అశోక్‌రెడ్డి అత్యవసరంగా సమావేశ మయ్యారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. జలమండలి ఉద్యోగులు, సిబ్బందికి సెలవులను రద్దు చేశారు.

Also Read : PM Narendra Modi: ఉక్రెయిన్‌ లో లగ్జరీ ట్రైన్ ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ ’లో ప్రయాణించనున్న మోదీ !

Leave A Reply

Your Email Id will not be published!