Telangana State Waqf Board: వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లును తిరస్కరించిన తెలంగాణా వక్ఫ్‌ బోర్డు !

వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లును తిరస్కరించిన తెలంగాణా వక్ఫ్‌ బోర్డు !

Telangana State Waqf Board: వక్ఫ్‌ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్‌ బోర్డు(Telangana State Waqf Board) ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఈ సవరణలు వక్ఫ్‌ ఆస్తుల రక్షణను హరించేలా ఉన్నాయని పేర్కొంది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024పై రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేని నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. బోర్డు సభ్యులు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, అక్బర్‌ నిజాముద్దీన్‌ హుస్సేని, సయ్యద్‌ బందగీ బాదేషా ఖాద్రి, డాక్టర్‌ సయ్యద్‌ నిస్సార్‌ హుస్సేన్, మొతాసింఖాన్, ఎం.ఏ.కే.ముఖీబద్, మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్‌ ఖానం, షేక్‌ లియాఖత్‌ హుస్సేన్‌ హాజరయ్యారు.

‘ఈ బిల్లు ముస్లిం సమాజాన్ని, వక్ఫ్‌ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉంది. విభజన సిద్ధాంతాన్ని అమలు చేయాలన్న ఎజెండాను ఖండిస్తున్నాం. ఇందులోని నిబంధనలు వక్ఫ్‌ ఆస్తులన్నీ కలెక్టర్ల ఆధీనంలోకి తీసుకొచ్చి వక్ఫ్‌బోర్డు స్వయం ప్రతిపత్తిని కాలరాసేలా ఉన్నాయి. కలెక్టర్లు విచక్షణాధికారంతో వక్ఫ్‌ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించేలా రూపొందించారు. ముస్లిమేతరుల్ని సభ్యులుగా చేర్చుతూ వక్ఫ్‌పాలక మండలి స్వరూపాన్ని మార్చేలా ఉన్నాయి. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’’ అని కమిటీ పేర్కొంది. భాజపాయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు చెందిన వక్ఫ్‌బోర్డు ఛైర్మన్లు, సీఈవోలతో సదస్సు నిర్వహించాలని తీర్మానించింది.

Telangana State Waqf Board – ప్రభుత్వానికి ధన్యవాదాలు – ఒవైసీ

రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకించిన మొట్టమొదటి బోర్డుగా తెలంగాణ వక్ఫ్‌ బోర్డు నిలిచిందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎక్స్‌లో పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ మాకు మద్దతుగా నిలిచినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

Also Read : West Bengal Bandh: కోల్‌ కతా లో బంద్‌ పిలుపునిచ్చిన బీజేపీ ! హై ఎలర్ట్ ప్రకటించిన దీదీ !

Leave A Reply

Your Email Id will not be published!