Bengal Bandh : ఈరోజు బెంగాల్ లో 12 గంటల బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ
దాంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది...
Bengal Bandh : ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆగస్ట్ 28వ తేదీన పశ్చిమ బెంగాల్(West Bengal)లో 12 గంటల బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటన చోటు చేసుకున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తుంది. స్థానిక నాయకుడు అర్జున్ సింగ్ నివాసానికి వెళ్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తన కారుపై ఈ దాడి చేశాయని ప్రియాంగు పాండే ఆరోపించారు. 50 నుంచి 60 మంది ఆందోళన కారులు తన కారును ఆపివేసి.. ఈ దాడికి తెగబడ్డారన్నారు. బాంబులు సైతం విసిరారని తెలిపారు. ఆరు నుంచి ఏడు రౌండ్ల కాల్పులు జరిపారని చెప్పారు. అయితే అందుకు సంబంధించిన పలు చిత్రాలను బీజేపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఆ క్రమంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ(BJP) మండిపడింది. దీనిని రాష్ట్ర బెనర్టీ ప్రభుత్వం ఖండించింది.
Bengal Bandh Today…
వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో.. బీజేపీ శ్రేణులు బుదవారం ఉదయం 6.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు బంద్కు పిలుపునిచ్చాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రాష్ట్ర రవాణా వ్యవస్థకు చెందిన బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ ఆందోళనలను ఎక్కడి కక్కడ నిలువరించేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు. ఇక ప్రియాంగు పాండే కారుపై దాడికి యత్నిస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత, బీజేపీ నాయకులు సువెందో అధికారి తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.
Also Read : US Elections 2024 : కమలా హరీష్ తో డిబేట్ కు సై అంటున్న ట్రంప్